State Govt Employees Union: ఏప్రిల్ నుంచి తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె ఆర్ సూర్యనారాయణ అన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా విశాఖ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కారం కోసం అనేకసార్లు సీఎంకు మంత్రులకు, సీఎస్‌కి ఫిర్యాదు చేసామని.. ఫలితం లేదని.. అందుకే ఆందోళన బాట పడుతున్నామని తెలిపారు. మా హక్కుగా ఉన్న ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలుగుతోందని.. ప్రతి ఉద్యోగికి.. ప్రభుత్వం ఎన్నో బకాయిలు పడిందని.. సగటు ప్రభుత్వ ఉద్యోగికి 3 లక్షల వరకు ప్రభుత్వం బాకీ ఉందని సూర్యనారాయణ పేర్కొన్నారు.
ప్రభుత్వం వల్లే తాము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది: సూర్యనారాయణ తమ హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతున్నామని.. మా సమస్యలు పరిస్కారం కోసం గవర్నర్‌కి మెమోరాండం ఇచ్చామని తెలిపారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మాపై చర్యలు తీసుకోవాలని సహచర ఉద్యోగ నేతలు అంటున్నారని అన్నారు. జగన్ మాట ఇచ్చిన ప్రకారం.. సీపీఎస్ రద్దు చేయాలని జగన్ ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. గవర్నర్‌ని కలిస్తే కొందరు పాకిస్తాన్ ప్రెసిడెంట్‌ని టెర్రరిస్టులను కలిశామనే విధంగా రాద్దాంతం చేస్తున్నారని అన్నారు.
చిన్న చిన్న నిరసన కార్యక్రమాలతో కాదు.. ఒక ఫలితం దిశగా తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని తెలిపారు. తాము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ప్రభుత్వం వలనే వచ్చిందని సూర్యనారాయణ అన్నారు. మా సంఘం సమావేశాలలో చర్చించి సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. తాము భజనతో కాదు భాధ్యతగా ప్రవర్తిస్తామని..అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడితే మంచిదేనని అన్నారు.
16 మార్చి నుంచి ప్రారంభమయ్యే రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేసాల్లో వచ్చే ఆర్ధిక సంవత్సరానికి ప్రతి పాదించే కేటాయింపుల్లో జీపీఎఫ్ నిధులు కేటాయించి ఒక పీడీ అకౌంట్ మాదిరిగా ఉంచి ఇతర అవసరాలకు మళ్లించే విధంగా కేటాయింపులు జరిగేలా నిబందన పొందు పరచమని రాష్ట్ర ప్రభుత్వానికి యావత్తు ఉద్యోగుల తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అప్పీల్ చేస్తున్నాం ఈ విషయంలో శాసన సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పక్షాల శాసన సభ్యులు కూడా మాకు సంఘీభావం తెలపాలని మనవి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లక్ష్యం డిమాండ్ ఒక్కటే హక్కుగా సంక్రమించిన ఆర్ధిక ప్రయోజనాలను తక్షణమే చెల్లించాలి.. భవిష్యత్తు చెల్లింపుల విషయంలో చట్టం చేయాలని మేము గవర్నర్ గారికి ఇచ్చిన మా డిమాండ్‌కి ప్రాధమిక స్థాయి నుంచి కట్టుబడి ఉన్నాము అని పునరుధ్ఘాచిస్తున్నా.-కె ఆర్ సూర్యనారాయణ, ఏపీజీఈఏ అధ్యక్షుడు
ఇవీ చదవండి: