Sukesh Gupta was arrested in the money laundering case sent him to remand: మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయినా సుకేశ్ గుప్తాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రిమాండ్‌కు తరలించారు. నాంపల్లి కోర్టు వచ్చే నెల 5వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిన్న రాత్రి సుకేశ్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. అతని దగ్గర వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత సీసీఎస్ కార్యాలయంలో ఉంచారు. ఈరోజు ఉదయం 11గంటల సమయంలో సీసీఎస్ నుంచి ఈడీ కార్యాలయానికి సుకేశ్ గుప్తాను తీసుకొచ్చి అనంతరం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కింగ్ కోఠిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు సుకేశ్ గుప్తాకు 14రోజుల రిమాండ్ విధించడంతో ఈడీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ రంగ సంస్థ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్(ఎంఎంటీసీ) నుంచి ఎంబీఎస్ జువెల్లర్స్ 2011 వరకు భారీగా బంగారం కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి రూ.503కోట్లకు చేరింది. ఎంఎంటీసీ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈడీ అధికారులు సైతం మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.