AP Teachers Unions Federation meeting: విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసేజీఓ 117ని రద్దు చేసి..ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25 నుంచి జూలై 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా పోరాటాలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఛైర్మన్ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మంజుల తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలో వారు మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ జీపీఎస్‌కు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేయకుండా జీపీఎస్ విధానం తీసుకువచ్చి.. ఇది దేశానికే ఆదర్శమని చెప్పడం హస్యస్పదంగా ఉందన్నారు.
ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే తాము అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందించామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను చైతన్య పరిచేందుకు ఈ నెల 25 నుంచి జులై 1 వరకు విజయనగరం, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాలో సదస్సులు నిర్వహిస్తామన్నారు. అలాగే జులై 2 నుంచి 9 వరకు విశాఖ, కృష్ణా, చిత్తూరు, తూర్పు గోదావరి, అనంతపురం, నెల్లూరు. గుంటూరు, కడప, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో సదస్సులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం జీపీఎస్ పేరుతో చేస్తున్న మోసాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గమనించాలని సూచించారు. సమాఖ్య ఆధ్వర్యంలో చేపడుతున్న సదస్సుల్లో భాగస్వామ్యం కావాలని వారు కోరారు.