STEMI PROJECT: గుండెపోటు వచ్చిన వారికి తొలిగంటలోనే ప్రాథమిక చికిత్స అందించే చర్యల్లో భాగంగా ఈ నెలాఖరులోగా చెన్నైకి చెందిన స్టెమీ ఇండియా సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం ఆస్పత్రులు హబ్ సెంటర్లుగా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. తొలి దశలో కర్నూలు, కాకినాడలో క్యాథ్‌ల్యాబ్స్ ఏర్పాటుకు రూ.120 కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు.
దీంతోపాటు స్పోక్ సెంటర్లుగా అభివృద్ధి చేసే ఆసుపత్రుల కోసం ఈసీజీ యంత్రాలు, థ్రాంబోలిసిస్ కోసం ఉపయోగించే ఇంజెక్షన్లను కొనుగోలు చేస్తున్నామన్నారు. బహిరంగ మార్కెట్లో రూ.30 వేలు ఖరీదు చేసే ఈ ఇంజెక్షన్‌ను రూ.20 వేలకు తీసుకుంటున్నామని, ఈ ఇంజెక్షన్ ద్వారా గుండెలోని బ్లాక్ కరిగి ప్రాణాపాయ పరిస్థితి నుంచి రోగులు బయటపడతారని కృష్ణబాబు అన్నారు. ఆ తరువాత క్యాథ్‌ల్యాబ్ ఉన్న ఆసుపత్రికి తరలిస్తే.. అవసరాన్ని బట్టి శస్త్రచికిత్సలు చేస్తారు.
ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి శిక్షణ నివ్వనున్నారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఈసీజీ పరీక్షలు నిర్వహించి, నివేదికలను డిజిటల్ విధానంలో హబ్ సెంటర్లలో ఉన్న వైద్య నిపుణులకు పంపుతారు. ఇక్కడి నిపుణులు ఇచ్చే సలహాలు అనుసరించి బాధితులకు థ్రాంబోలిసిస్ చికిత్సను అందిస్తారు. ఈ విధానం అమలు తీరును నాలుగైదు నెలల పాటు లోతుగా పరిశీలించనున్నారు.