మాట తప్పను మడమ తిప్పను మాటలు గుర్తున్నాయా సీఎం : యూటీఎఫ్ ఉపాధ్యాయులు Statewide Government Employees Strike :అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగుల బాటలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు సమ్మెకు పిలుపునిచ్చారు. బకాయిలు చెల్లించి, ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు ఇవ్వాలంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు బుధవారం రోడ్డెక్కారు. మూడో దశ ఉద్యమంలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 12 గంటలు ధర్నా నిర్వహించారు.
యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆందోళన
Prakasam :సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఉపాధ్యాయులు ఒంగోలు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా ఆలస్యంగా జీతాలు రావడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చిరుద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రతినెల ఒకటో తేదినే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Kurnool : మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు, పీఆర్సీ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కర్నూలులో ఉపాధ్యాయులు ప్లకార్డులు ప్రదర్శించారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ప్రభుత్వంలో డీఏలను పెండింగ్‌లో పెట్టడాన్ని సీఎం జగన్ తన పాదయాత్రలో తప్పుబట్టారని గుర్తు చేశారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ అరకొర వేతనాలతో ఉద్యోగులు అవినీతిమారులుగా మారుతున్నారని ఆరోపించి, ఇప్పుడు ఐదు డీఏలను పెండింగ్‌లో పెట్టడం దారుణమన్నారు. రూ.20 వేల కోట్లకు పైగా బకాయిలను పెండింగ్‌లో పెట్టడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.
UTF Protest in Ap : సీపీఎస్ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు..
Nandhyala :ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌తో బుధవారం నంద్యాల ధర్నా చౌక్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఓ ఉపాధ్యాయుడు పాట పాడి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. మాట తప్పాను మడమ తిప్పాను అంటూ ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాల వారిని మోసం చేశారని మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సృష్టం చేశారు.
Vizianagaram :ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విజయనగరం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎస్‌ని రద్దు చేయకుండా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు. పీఆర్సీ బకాయిలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 9,10 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో 36 గంటల నిరసన దీక్షలు చేపడతామని హెచ్చారించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన 11వ పీఆర్సీ, డీఏ, పీఎఫ్‌తో పాటు ఇతర బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో అందరూ ఇబ్బంది పడుతున్నారని, అన్ని వర్గాలు చేస్తున్న పోరాటాలతో రాష్ట్రం సమ్మె ఆంధ్రప్రదేశ్‌గా మారిందని పేర్కొన్నారు.