Statewide Anganwadi Workers Strike :న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని జగన్ ప్రభుత్వాన్ని కోరుతున్నామే తప్ప గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని అంగన్వాడీలు అన్నారు. 38వ రోజు కూడా ఆందోళనలు కొనసాగించారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట జగన్ మాస్క్ ధరించి మహిళలపై చెయ్యి పెట్టి భస్మాసురుడు అంటూ నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించకపోవడంతో ఎమ్మెల్యే కనిపించడం లేదని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు ప్రజామద్దతు కూడగడుతూ నెల్లూరు వీఆర్సీ కూడలి వద్ద అంగన్వాడీలు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రభుత్వ తాటకు చప్పుళ్లకు వెనక్కి తగ్గేదే లేదు : అంగన్వాడీలు
Anganwadi Workers Strike in Ambedkar District : వేతనాలు పెంచాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మద్దతు తెలిపారు. ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరితే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడం దారుణమని మండిపడ్డారు. అంబేడ్కర్ జిల్లా ముమ్మిడివరంలో అంగన్వాడీ ఆయాలు, టీచర్లకు జీతాలు పెంచి స్కూళ్లు తెరిపించాలని చిన్నారులు ధర్నాలో పాల్గొన్నారు. వారికి తెలుగుదేశం నేతలు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని విజయనగరం కలెక్టరేట్ నుంచి ఐసీడీఎస్ ప్రాజెక్టు వరకు ర్యాలీ చేస్తున్న అంగన్వాడీలకు సీపీఎం నేతలు మద్దతు ప్రకటించారు. శ్రీకాకుళం టెక్కలిలో ఎస్మా నోటీసులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి నుంచి ఐసీడీఎస్ ప్రాజెక్టు వరకు ర్యాలీ నిర్వహించారు. డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని అంగన్వాడీలు తేల్చిచెప్పారు.
ప్రభుత్వ మొండి వ్యవహార శైలిని నిరసిస్తూ కార్మిక సంఘాల జైల్భరో