ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Central Govt funds: నిధుల మళ్లింపుపై ఏపీ సర్కార్​కు షాక్.. వడ్డీ కట్టాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరిక

Central Government Issuance of key orders: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసే పథకాల నిధుల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం సొంతంగా అమలుచేసే పథకాల నిధులను మళ్లిస్తే ఊరుకునేది లేదని, ఇచ్చిన నిధులను ఇతర అవసరాలకు వాడుకుని, తర్వాత జమ చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. ఒకవేళ ఇతర అవసరాలకు నిధులను మళ్లిస్తే 7 శాతం వడ్డీ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Central Govt
Central Govt

By

Published : Apr 14, 2023, 9:32 AM IST

Updated : Apr 14, 2023, 9:42 AM IST

Central Government Issuance of key orders: రాష్ట్రాల్లో తాము సొంతంగా అమలుచేసే పథకాల నిధులను మళ్లిస్తే ఊరుకునేది లేదని.. కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇచ్చిన నిధులను ఇతర అవసరాలకు వాడుకుని, తర్వాత జమ చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. ఇచ్చిన నిధులను ఇచ్చినట్లు.. అదే నెలలో ఆయా శాఖలకు విడుదల చేయాలని తెలిపింది. అలా విడుదల చేయకుండా వాడుకున్న నిధులకు 7శాతం వడ్డీ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం విడుదల చేసే నిధులను, నెలలోగా సంబంధిత శాఖలకు పంపాల్సిందేనని.. రాష్ట్రానికి కేంద్రం విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. తమ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి, వీలు కుదిరినప్పుడు రాష్ట్ర వాటా కలిపి సంబంధిత శాఖలకు పంపాలనుకుంటే ఊరుకోబోమని స్పష్టం చేసింది. రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖకు పంపిన నిధులను సకాలంలో విడుదల చేయలేదని అభ్యంతరం తెలిపింది. అందువల్ల 7శాతం వడ్డీ కింద 39 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. తమ ప్రాయోజిత పథకాలను అమలుచేసే అన్ని ప్రభుత్వ శాఖలకు అందించే నిధులను.. రాష్ట్ర ఆర్థికశాఖ ఈ నెల నుంచి సకాలంలో అందించాలని నిర్దేశించింది. లేదంటే జాప్యానికి 7శాతం వడ్డీ చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే, అన్ని రాష్ట్రాలకూ కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలను మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

సాధారణంగా కేంద్రం నుంచి వచ్చిన నిధులను 21 రోజుల్లో, రాష్ట్ర వాటా నిధులను 40 రోజుల్లోగా.. రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత శాఖలకు పంపాలన్న నిబంధన ఉంది. ఏపీ లాంటి రాష్ట్రాలు కేంద్ర నిధులను నిర్దిష్ట వ్యవధిలో సంబంధిత శాఖలకు పంపకుండా, ఇతర అవసరాలకు మళ్లిస్తున్నాయి. రాష్ట్ర వాటా విడుదలలోనూ జాప్యమవుతోంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలు సకాలంలో పూర్తవడం లేదు. దీనివల్ల వైద్యఆరోగ్యం, విద్యాశాఖ నిధుల పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఇరవై శాఖల ద్వారా అమలవుతున్నాయి. ఆ ఇరవై శాఖల పథకాల ఖర్చంతా కేంద్ర పభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 60:40 నిష్పత్తిలో భరించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖకు ఏటా సుమారు 2వేల 200 కోట్ల కేంద్ర నిధులు అందుతున్నాయి. రాష్ట్రాల వారీగా పంపిన నిధులను సకాలంలో వెచ్చించకపోవడం, వ్యయ వివరాల సమర్పణలో జాప్యంతో.. భవిష్యత్తు అవసరాల అంచనాలో కేంద్రం సమస్యలు ఎదుర్కొంటోంది. రాష్ట్రాలతో కేంద్రం చర్చిస్తున్నప్పుడు ఆయా శాఖలకు నిధుల కేటాయింపు అంశాన్ని ప్రస్తావిస్తున్నా.. ఇప్పుడు నేరుగా ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నిధుల వ్యయ వివరాలకు సంబంధించి ప్రత్యేక నమూనా కింద పంపాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అంతేకాకుండా, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖర్చు వివరాలను కూడా స్పష్టంగా పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించింది. దీనిని ‘ట్రెజరీ లెగసీ డేటా’గా పేర్కొంటారు. కొన్నిచోట్ల ప్రభుత్వ శాఖలకు కేటాయింపులకంటే ఎక్కువ ఖర్చయినట్లు నివేదించడంపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 2020-21 నిధుల వ్యయంపై స్పష్టత వచ్చాక, 2022-23 ఆర్థిక సంవత్సరం వ్యయ వివరాలపై కేంద్రం దృష్టి పెట్టనుంది.

ఏపీ సర్కార్​కు కేంద్ర ప్రభుత్వం షాక్..

ఇవీ చదవండి

Last Updated : Apr 14, 2023, 9:42 AM IST

ABOUT THE AUTHOR

...view details