ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తీర్మానానికి వ్యతిరేకంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆందోళనలు - kurnool

BJP SC Morcha : వైసీపీ ప్రభుత్వం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించటాన్ని బీజేపీ ఎస్సీ మోర్చా వ్యతిరేకిస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

BJP SC Morcha
బీజేపీ ఎస్సీ మోర్చా ఆందోళనలు

By

Published : Mar 27, 2023, 4:39 PM IST

Dalit Christians : దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించాలంటూ శాసనసభలో వైసీపీ ప్రభుత్వం చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా.. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ పాల్గొన్నారు. కుల, మత ప్రాదికనే ముఖ్యమంత్రి జగన్ మొదటి నుంచి పాలన చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఇది న్యాయస్థానం ద్వారా తీసుకోవాల్సిన నిర్ణయం అని స్పష్టంగా చెబుతోందన్నారు.

ఉద్దేశపూర్వకంగా న్యాయ‌విధానంపై ఇది ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అని బీజేపీ పరిగణిస్తోందన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉందన్నారు. అన్ని మతాల వారు జగన్​కు ఓట్లు‌వేసి 151 సీట్లు ఇచ్చి సీఎంను‌ చేశారని.. అధికారంలోకి రాగానే పాస్టర్లకు డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. తహశీల్దారు ప్రమేయం లేకుండా జీఓ ద్వారా భూములు ఇచ్చి చర్చిలకు అనుమతి ఇచ్చారని.. కోట్ల రూపాయల విలువైన భూములను చర్చిలకు ప్రభుత్వం పంచిపెడుతోందని అన్నారు.

చర్చిలకు ప్రభుత్వం భూమి పంచిపెడుతోందనడానికి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఆలయాల జీర్ణోద్ధరణకు మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు ఇస్తోందన్నారు. హిందూత్వ వ్యతిరేక అజెండాతో జగన్ ముందుకు‌ వెళుతున్నారని.. ఈ తరహా చర్యలను నిరసిస్తూ తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌కు తాము వినతిపత్రం అందజేయనున్నట్లు వీర్రాజు తెలిపారు.

సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

"అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది. ఇది న్యాయస్థానం ద్వారా తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టంగా చెబుతోంది. ఉద్దేశపూర్వకంగా న్యాయ‌విధానంపై ఇది ఒత్తిడి తెచ్చే ప్రయత్నమని బీజేపీ పరిగణిస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉంది. ఇది ఓట్​ బ్యాంక్​ రాజకీయం."- సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

విశాఖలో ఆందోళన : బీజేపీ ఎస్సీ మోర్చా ప్రతినిధులు విశాఖలో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ కులంపై చిన్నచూపు ఉందని.. అందుకే తమ రిజర్వేషన్లు ఇతరులకు మార్చే కుఠిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాలను ఆదుకోవాలని.. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించాలని.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సక్రమంగా అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అంతేకానీ తమలో తమకు చిచ్చు పెడుతూ ఇతరులను ఎస్సీల్లో చేర్చే ప్రయత్నాలు నిలిపి వేయాలని నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.

శ్రీకాకుళం సబ్​ కలెక్టర్​కు వినతి : వైసీపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై శ్రీకాకుళం జిల్లాలోని విశ్వహిందూ పరిషత్ సభ్యులు, బీజేపీ శ్రేణులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. టెక్కలిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించి, సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందించాయి. రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, అంబేడ్కర్ ఆశయాలను కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎస్సీల నిధులు పక్కదారి పట్టిస్తూ ఇప్పటికే తీవ్ర అన్యాయం చేస్తోందని అన్నారు. మత మార్పిడిలు జరిగితే హిందూ వ్యవస్థ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కర్నూలులో ధర్నా: బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతం మారిన రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి.. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఓటమి చెందడంతో.. ఓ వర్గానికి చెందిన ప్రజల మద్దతు కోసమే ఇలాంటి తీర్మానాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details