AP CS Jawahar Reddy Review on Ganja: రాష్ట్రంలో గంజాయి సాగు, మత్తు మందుల సరఫరాను ఉక్కుపాదంతో అణచివేయాలని, అందుకు సంబంధిత శాఖలు, సంస్థలు కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతనరాష్ట్రస్థాయి నార్కోటిక్స్ కో-ఆర్డినేషన్ అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. గంజాయి సాగు ,వివిధ మత్తు మందులను విక్రయం చేసే వారిపై పీడీ చట్టం కింద కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ఇలాంటి కేసుల్లో అరెస్టైన వారికి బెయిలు రాకుండా చూడాల్సిన అవసరం ఉందని.. న్యాయ, పోలీస్ వ్యవస్థలను పటిష్టం చేయాలన్నారు.
జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల అక్రమ రవాణాను నియంత్రించేందుకు వివిధ పార్శిల్, కొరియర్ వాహనాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టాలనిప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రైల్వే పార్శిళ్లను కూడా పూర్తిగా తనిఖీ చేసేలా రైల్వే, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గంజాయి, ఇతర మత్తు మందులు తీసుకోవడం వల్ల కలిగే అనర్దాలపై ప్రజల్లో.. ముఖ్యంగా యువతలో పూర్తి స్థాయిలో అవగాహనను పెంపొందించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని సూచించారు.
కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధులకు దీనిపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సహా పరిసర జిల్లాల్లో చేపట్టిన ముమ్మర తనిఖీలు మూలంగా చాలా వరకూ గంజాయి సాగును తగ్గించగలిగామని చెప్పారు. గంజాయి ఎక్కువగా ఒడిశా రాష్ట్రం నుంచి సరఫరా అవుతోందని.. పట్టుకున్న గంజాయిని ధ్వంసం చేయడంతో పాటు రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. గంజాయి స్మగ్లర్లు, డ్రగ్ పెడ్లర్లు వాటితో పట్టుబడి అరెస్టైనపుడు వెంటనే బెయిల్ రాకుండా చూడాల్సిన అవసరం ఉందని డీజీపీకి సూచించారు.
CS Jawahar Review on Sports: మరోవైపు రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. 2023-28 రాష్ట్ర క్రీడా విధానంపై క్రీడా శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయని.. అది మంజూరైతే రాష్ట్రానికి క్రీడా పరంగా దేశంలోనే మరింత గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరిల్లో మూడు క్రీడా అకాడమీలను ఏర్పాటు చేసేందుకు నూతన క్రీడా విధానంలో పొందుపర్చాలని చెప్పారు. అలాగే వివిధ జిల్లాల్లో 16 క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి క్రీడా పాఠశాలలో 100 మంది బాలురు, 100 మంది బాలికలను 16 విభాగలకు సంబంధించిన వివిధ క్రీడల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Jagan Review on Sports: 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు: సీఎం