AP VRO ASSOCIATION: ప్రభుత్వం, అధికారులు చెప్పిన పనులు సకాలంలో పూర్తి చేయలేక వీఆర్వోలు మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాష్ట్ర వీఆర్వో సంఘ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదని.. కానీ తమపై విపరీతంగా పని భారం మోపుతున్నారని ఆందోళన చెందుతున్నారు. అన్ని జిల్లాలకు చెందిన వీఆర్వో సంఘాల నాయకులు విజయవాడలో సమావేశమై.. సమస్యలపై చర్చించారు. అనేక సంత్సరాల తర్వాత ఇన్నాళ్లకు సర్వే జరుగుతోందని, వీఆర్వోలు సర్వేలో నిమగ్నమై విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సర్వే ప్రక్రియ తప్పుల్లేకుండా చేయాలని కోరుకోవాలే కానీ వంద రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు చెప్పడం సరికాదని ప్రతినిధులు మండిపడుతున్నారు. సర్వేను హడావుడిగా చేయడం వల్ల తప్పులు వచ్చే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీఆర్ఏల కొరత కారణంగా వీఆర్వోలపై పని భారం: గ్రామాల్లో వీఆర్ఎల కొరత తీవ్రంగా ఉందని, వీఆర్వోల నియామకాలు జరపకపోవడం వల్ల పని భారం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. గృహనిర్మాణ శాఖలో పనులు, ఎంపీడీవో కార్యాలయాల్లో సమావేశాలు ఇలా ప్రతి పనికీ వీఆర్వోలనే ఉపయోగిస్తున్నారని.. దీంతో తమపై ఒత్తిడి పెరుగుతోందని వారు వాపోతున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక కొందరు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. తాము మనుషులమే అని.. ఎన్ని పనులు చేయగలమని ప్రశ్నిస్తున్నారు. ఒత్తిడి కారణంగా ఇబ్బందులకు గురువుతున్నామని, వీఆర్వోల సాధకబాధకాలను సీఎం దృష్టికి తీసుకెళ్లదామని తాము అనుకుంటే కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రికి వీఆర్వోలపై తప్పుడు నివేదికలు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఆ సమయంలోపు బయోమెట్రిక్ వేయకపోతే సెలవుగా నిర్ధరణ: వీఆర్వోలు ప్రభుత్వ ఆదేశాలు పాటించడం లేదని, సచివాలయాల్లో బయోమెట్రిక్ వేయడం లేదని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. తాము బయోమెట్రిక్ వేయం అని చెప్పడం లేదని.. కానీ ఎక్కువగా బయట విధులు నిర్వహించే తాము ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో కనుక బయోమెట్రిక్ వేయపోతే సెలవుగా నిర్ధారిస్తున్నారని వాపోతున్నారు. ఉదయం 10 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 3 నుంచి 5 లోపు రెండో సారి, సాయంత్రం 5 తర్వాత మరొకసారి బయోమెట్రిక్ వేయాలని ఉన్నతాధికారులు చెబుతున్నారని వీఆర్వోలు తెలిపారు.
ఒకానొక సమయంలో రాత్రి పది గంటల వరకు గడప గడప కార్యక్రమం: రోజుకు మూడు సార్లు బయోమెట్రిక్ వేయాలంటే కష్టంగా ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రజా ప్రతినిధులు నిర్వహిస్తున్న గడకు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా తాము పాల్గొంటున్నట్లు తెలిపారు. ఒకానొక రోజు గడపగడపకు కార్యక్రమం రాత్రి 10 గంటలు అవుతుందని అప్పటి వరకు కూడా తాము తిరుగుతున్నామని చెప్పారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా వీఆర్వోలు ఖాళీ లేకుండా విధులు నిర్వహిస్తున్న తమపై అధికారులు వేధింపులకు దిగుతున్నారని వాపోతున్నారు.