State Governmnet Honor to Justice PK Mishra: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రను.. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. గౌరవార్థం విందు ఏర్పాటు చేసింది. గురువారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్,ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, సీఎం జగవ్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రను సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్.. ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. మంత్రులు తానేటి వనిత, ధర్మాన ప్రసాదరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రముఖులు, న్యాయవాదులు పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం జస్టిస్ మిశ్ర, ముఖ్యమంత్రి జగన్ గ్యాలరీ నుంచి కొంచెం ముందుకు వచ్చి అక్కడే ఉన్న హైకోర్టు జడ్జ్‌లను కలిసి మాట్లాడారు. కార్యక్రమంలో జస్టిస్ మిశ్ర సతీమణి సుచేత, అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
డైనింగ్ హాల్లో విలేకరులు.. తెరపై వీక్షణమే: జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర విందు కార్యక్రమానికి మీడియాను ప్రభుత్వం ఆహ్వానించింది. సుమారు 30మందికి పాస్‌లు ఇచ్చారు. అయితే వారికి ప్రధాన సమావేశ మందిరంలోకి అనుమతి ఇవ్వలేదు. వెనుక ఉన్న డైనింగ్‌హాల్ లోనే కూర్చోవాలని స్పష్టం చేశారు. అక్కడ తెర ఏర్పాటు చేశామని.. అందులో వీక్షించాలని చెప్పారు. దీంతో విలేకరులంతా డైనింగ్ హాల్కే పరిమితం అయ్యారు.