Pensions: వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ఇతర పింఛనుదారుల్లో ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. అలాంటి వారికి సామాజిక భద్రత పింఛన్లే పెద్ద భరోసా. ఇలాంటి పేదలపై వైసీపీ ప్రభుత్వ చర్యలు పిడుగుల్లా పడుతున్నాయి. తప్పుడు తడకల సర్వేను ప్రాతిపదికగా తీసుకుని.. అర్హులను కూడా అనర్హుల జాబితాలోకి చేర్చేస్తుండటంతో లబ్ధిదారులు భోరుమంటున్నారు. తాజాగా లక్షా 60 వేల మంది పింఛనుదారులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కారు, పొలం లేకున్నా ఉన్నట్లు, 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగించకున్నా వాడినట్లు.. పొంతన లేని కారణాలతో నోటీసులు జారీ చేసినవే భారీగా ఉన్నాయి. తాత్కాలికంగా పింఛను నిలిపేశామని, నోటీసు అందుకున్న 15 రోజుల్లో అర్హతను నిరూపించుకోకపోతే శాశ్వతంగా రద్దు చేస్తామని స్పష్టంగా చెప్పేసింది.
గతంలో చేసిన పల్స్ సర్వేతోపాటు వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేసిన నవశకం సర్వేలోనూ చాలా వరకు తప్పులు నమోదయ్యాయి. వాలంటీర్ల ద్వారా చేయిస్తున్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సైతం తప్పుల తడకే. చాలా ప్రాంతాల్లో ఆధార్ సంఖ్యలను తప్పుగా నమోదు చేశారు. ఈ సర్వేల ప్రాతిపదికగానే ప్రభుత్వం పింఛన్లను తనిఖీ చేయిస్తోంది. దీనివల్ల అర్హులు కూడా అనర్హుల జాబితాలో చేరుతున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా నోటీసులిస్తూ పింఛనుదార్లను ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. లేని కారణాన్ని ఉన్నట్లు చూపిస్తూ, అర్హత నిరూపించుకోవాలని చెబుతుండటంతో.. లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు.