No Response in Spandana: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) ప్రతి సోమవారం రోజున ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో తాజాగా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సమస్యల పరిష్కారం కోసం బాధితులు స్పందన కార్యక్రమానికి వెళ్లి వారి గోడును చెప్పుకుంటారు. అనంతరం తమ సమస్యలను త్వరగా పరిష్కరించి.. అధికారులు, ప్రభుత్వం అండగా నిలవాలని వినతిపత్రాల రూపంలో విజ్ఞప్తి చేస్తుంటారు. అయితే, బాధితుల గోడును, వారి వినతులను స్వీకరించాల్సిన అధికారులు.. వారి సొంత చరవాణుల్లో అంకితమైపోవటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్పందన కార్యక్రమంలో ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే (అధికారి) కరువయ్యారని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
spandana program issues: 'స్పందన' కరవు.. సమస్యలు పరిష్కరించండి మహాప్రభో..'
బాధితుల గోడు మరిచారు- ఫోన్లలో నిమగ్నమైపోయారు.. ఎన్టీఆర్ కలెక్టరేట్‌లో ఈరోజు స్పందన కార్యక్రమం జరిగింది. ప్రజలు వారి సమస్యలు చెప్పుకొని.. వాటి పరిష్కారం కోసం అధికారుల వద్దకు వచ్చారు. దీంతో విధులు నిర్వర్తించాల్సిన అధికారులు.. సెల్ ఫోన్లలో నిమగ్నమైపోయారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వీడియోలను చూసుకోవడం, ఫోన్లలో మాట్లాడుకోవడం చేశారు. బాధితులు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి పింఛన్ రావడం లేదని, ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వలేదని..పలు రకాల సమస్యలతో సంబంధిత అధికారులకు విన్నవించుకోవడానికి వస్తే.. వారిని పట్టించుకోకుండా అధికారులు ఫోన్లలో కాలక్షేపం చేయటంపై విమర్శలు తలెత్తుతున్నాయి.
అధికారుల తీరుపై బాధితులు ఆగ్రహం.. ప్రతి సోమవారం రోజున బాధితులు.. వివిధ గ్రామాల నుంచి అష్టకష్టాల పడి, కాళ్లు అరిగేలా కలెక్టర్‌ను కలిసి స్పందనలో అర్జీలు ఇవ్వడానికి వస్తున్నారు. అయినా, బాధితుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వం ఇల్లు ఇస్తామంటే డబ్బులు చెల్లించామని.. ఇల్లు రాక, చెల్లించిన సొమ్ము తిరిగి రాక బాధితులు కలెక్టర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి.. సమస్యలు పరిష్కారం కావడం లేదని పదుల సార్లు బాధితులు కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చి మొర పెట్టుకుంటున్నారు. భూ సమస్యలను తీర్చాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో బాధితుల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.