Minister Kottu Satyanarayana:విజయవాడలో ప్రభుత్వం చేపట్టిన యజ్ఞం రెండో రోజు కొనసాగింది. సభలు, సమావేశాలు మాదిరిగా ఒకేసారి జనం కనిపించకపోయినంత మాత్రాన తక్కువ సంఖ్యలో వస్తున్నట్లు కాదని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఇది రాష్ట్ర సంక్షేమం కోసం చేస్తున్న యాగమని.. ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో.. అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ యజ్ఞం రెండో రోజు శాస్త్రోక్తంగా కొనసాగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆశించిన దాని కంటే తక్కువగా భక్తులు వస్తుండడంతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ఎవరికీ ఎలాంటి పాస్‌లు, రుసుము లేవని... యజ్ఞం చూసేందుకు మైదానంలోకి వచ్చిన వారిని యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు వీలుగా వారికి అసౌకర్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు మాదిరిగా ఒకేసారి వేల మంది భక్తులు మైదానంలో కనిపించకపోయినంత మాత్రాన తక్కువ సంఖ్యలో వస్తున్నట్లు కాదని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
ఇది ఓ ఒక్కరి కోసం చేస్తున్న యజ్ఞం కాదని అన్నారు. 550 మంది రుత్విక్కులు... మరో 300 మంది సహాయకులు... శాస్త్రోక్తంగా వైఖానసం, పాచరాత్రం, శైవం, వైదిక స్మార్తం ఆగమాల ప్రకారం ఆయా యాగశాలల్లో తమ క్రతువులును కొనసాగిస్తున్నారని చెప్పారు. ఒక్కో యాగశాలలో 27 కుండాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి రోజు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు.. .సాయంత్రం ఐదున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలకు యజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. యాగ సందర్శనకు వచ్చే భక్తులకు తీర్థప్రసాదాలతోపాటు అభిషేకజలాల సంప్రోక్షణ కూడా చేయాలని సూచించామన్నారు. సాయంత్రం వేళ ప్రవచన కార్యక్రమాలను ఆరున్నర గంటల నుంచి గంటపాటు జరిగేలా మార్పు చేశామన్నారు.
'ఎండా కాలం అయినా వేలాది మంది భక్తులు యజ్ఞంలో పాల్గొనడానికి వస్తున్నారు. వచ్చిన వారు వచ్చినట్లు ఈ యాగంలో పాల్గొని వెళ్లి పోతున్నారు. అయితే, కొందరు అసలు భక్తలు రావడం లేదని అంటున్నారు. సభలు, సమావేశాల కాదు అనే అంశాన్ని మీడియా గుర్తుంచుకోవాలి. అందరి మంచి కోసం ఎంతో శ్రమకోర్చి ఈ యజ్ఞం చేస్తున్నాం. ఈ యజ్ఞానికి సంబందిచి ఎలాంటి పాసులు అవసరం లేదు. ఎవరైనా ఈ యాగంలో పాల్గొనవచ్చు పోలీసులు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సామాన్యులను అనుమతించి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి.'- కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి
విజయవాడలో రెండో రోజు కొనసాగిన శ్రీలక్ష్మీ యజ్ఞం
ఇవీ చదవండి: