Southwest Monsoon Arrives in AP: బిపోర్జాయ్ తుఫాను ప్రభావంతో ఆలస్యంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు దాదాపు 15 రోజుల ఆలస్యంగా ఏపీ అంతటా విస్తరించాయి. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలియచేసింది. రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బిపోర్ జాయ్ తుపాను బలహీనపడినా అనంతర పరిస్థితుల ప్రభావంతో దేశంలో రుతుపవనాలు నెమ్మదిగానే విస్తరిస్తున్నట్టు ఐఎండీతెలిపింది. రాగల రెండు రోజుల్లో తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలు, ఒడిశా, ఝార్ఖండ్ తదితర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల విస్తారంగా వానలు కురిసే సూచనలు ఉన్నట్టు అమరావతిలోని వాతావరణ విభాగం తెలిపింది. చాలా చోట్ల ఈదురుగాలులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలు కురుస్తుండటంతో ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గడచిన 15 రోజులుగా ఏపీ, తెలంగాణాలో కొనసాగుతున్న హీట్ వేవ్ పరిస్థితులు నిన్నటి వరకూ ఉన్నట్టు వాతావరణ విభాగం తెలిపింది.
శ్రీసత్యసాయి జిల్లా:భారీ వర్షం కారణంగా శ్రీసత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో రహదారులు జలమయమయ్యాయి. పట్టణంలోని వేమారెడ్డికూడలిలో జాతీయరహదారిపై వర్షపునీరు నిలిచిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పూలబజారు, కళ్లంగడివీధి, నల్లగుట్టబజారు ప్రాంతాలలో డ్రైనేజ్‌లు పొంగటంతో ఇళ్లలోకి మురుగునీరు చేరింది. ఇంటిలోకి నీరు చేరటంతో వస్తువులన్నీ తడిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను మున్సిపాలిటి వారు శుభ్రం చేయకపోవటం వల్ల ఈ సమస్య తలెత్తిందని స్థానికులు వాపోయారు. తమ సమస్యలపై పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే, మున్సిపాలిటి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదన్నారు. తక్షణమే తమ సమస్యలు అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.