Sons who neglected mother in Hyderabad: బిడ్డ మనసెరిగి ఆకలి తీర్చే అమ్మకు.. ఆరుపదుల వయసులో అన్నం కరవైంది. రూ.కోట్ల ఆస్తులున్న ఆ మాతృమూర్తి పస్తులతో కాలం గడపాల్సి వచ్చింది. కన్నపిల్లలు చెట్టంత ఎదిగినా.. తల్లికి నీడనివ్వలేదు. శరీరం సహకరించకున్నా..ఆ అమ్మ..15 కిలోమీటర్ల దూరం నడచివెళ్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించి బిడ్డల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేసి విజయం సాధించారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌కు చెందిన బాధితురాలికి రూ.5 కోట్ల విలువైన సొంత భవనం ఉంది. భర్త నాలుగేళ్ల క్రితం మరణించడంతో ఒంటరైన ఆమెకు అండగా ఉంటూ ధైర్యం చెప్పాల్సిన కుమారులు పట్టించుకోవడం మానేశారు.
కనీసం అన్నం పెట్టేందుకూ మనసు రాలేదు. నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేశారు. ఆమె కొద్ది రోజుల పాటు వృద్ధాశ్రమంలో ఉన్నారు. తర్వాత తెలిసిన వారి సహకారంతో ఎలాగోలా నెట్టుకొచ్చిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ 2018 మేలో ఆర్డీవోకు మొరపెట్టుకున్నారు. విచారణ అనంతరం తల్లిబాగోగులు చూసుకోవాలంటూ అవార్డు మంజూరైనా కుమారులు ఖాతరు చేయలేదు. చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో బాధపడుతూ నీరసించిపోతూనే ఆ వృద్ధురాలు పురానీహవేలీలోని న్యాయసేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ)ను ఆశ్రయించారు.