Smart Meters Tenders In AP: రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ మీటర్లకు 6,480కోట్లతో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే ప్రయత్నం ఆఖరి క్షణంలో విఫలమైన నేపథ్యంలో మూడు భాగాలుగా ఈ టెండర్లు పిలవాలని డిస్కంలు నిర్ణయించాయి. మీటర్లు వాటికి అనుబంధ పరికరాల కొనుగోలుకు గతంలో ఒకే టెండర్ పిలిచిన డిస్కంలు నిర్ణయాన్ని మార్చుకొని వేర్వేరుగా బిడ్లు ఆహ్వానించాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిధులు భారీగా వెచ్చించినట్లు కనిపించకుండా ఇలా విడగొట్టినట్లు తెలుస్తోంది. ఈ మూడు టెండర్ల విలువ సుమారు 5,600కోట్లు ఉంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
మూడు డిస్కంల పరిధిలో 17.59 లక్షల స్మార్ట్ మీటర్ల అనుబంధ పరికరాల కొనుగోలుకు 2,163.11కోట్లతో ఈనెల22న టెండర్ ప్రకటన ఇచ్చారు. పూర్తి వ్యయాన్ని గుత్తేదారే భరించేలా క్యాపెక్స్ విధానంలో ఇవి కొనాలని నిబంధనల్లో చేర్చారు. 2023 జనవరి 11లోగా బిడ్ దాఖలుకు తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ-ఈపీడీసీఎల్, కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ-సీపీడీసీఎల్ తుది గడువు నిర్దేశించగా దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ-ఎస్ పీడీసీఎల్ మాత్రం 13వరకు అవకాశం ఇచ్చింది. గతంలో మీటర్ల కొనుగోలు, నిర్వహణ, అనుబంధ పరికరాల సరఫరాకు 6,480 కోట్లతో ఒకే టెండరును ప్రభుత్వం జారీ చేసింది.