ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదన.. ఆమోదం తెలిపిన ఎస్​ఐపీబీ - కడప స్టీల్‌ప్లాంట్

SIPB Accepted Investment Proposals : కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు దిశగా ఎట్టకేలకు ముందడుగు పడింది. రూ.8వేల 800 కోట్లతో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు జేఎస్​డబ్ల్యూ గ్రూప్ ముందుకు రాగా.. ఈ ప్రతిపాదనకు ఎస్​ఐపీబీ పచ్చజెండా ఊపింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థల పంప్డ్ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకూ ఆమోదం తెలిపింది. మొత్తంగా రాష్ట్రంలో రూ.23 వేల 985 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Dec 12, 2022, 10:51 PM IST

రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదన.. ఆమోదం తెలిపిన ఎస్​ఐపీబీ

SIPB Accepted Investment Proposals : సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్​ఐపీబీ) సమావేశంలో రూ.23 వేల 985 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వైఎస్సార్​ జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్​డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్‌ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఎస్​ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు విడతల్లో మొత్తంగా రూ.8వేల 800 కోట్ల పెట్టుబడి పెడతామని ఆ సంస్థ ప్రతిపాదనలో తెలిపింది. మొదటి దశలో ఏడాదికి 1 మిలియన్ టన్నులు, రెండో విడతలో 2 మిలియన్ టన్నుల స్టీల్‌ ఉత్పత్తులు చొప్పున మొత్తంగా ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తులు చేయనున్నట్లు తెలిపింది. వీలైనంత త్వరగా ప్లాంట్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం జగన్ సూచించారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో వెనకబడిన రాయలసీమ ముఖచిత్రం మారడమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుందన్నారు.

1600 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు ఎస్​ఐపీబీ పచ్చజెండా ఊపింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రూ.6 వేల 330 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 4 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో వేయి మెగావాట్లు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల ప్రాజెక్ట్ నెలకొల్పనున్నట్లు సంస్థ తెలిపింది. 8వేల 855 కోట్ల హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుకూ ఎస్​ఐపీబీ ఆమోదం తెలిపింది. ఎర్రవరం, సోమశిల వద్ద షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రెండు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. తద్వారా 2100 మెగావాట్ల ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details