Vijayawada Indrakiladri temple EO Vs Chairman issue updates: విజయవాడ (బెజవాడ)లో కొలువైన కనక దుర్గమ్మ (ఇంద్రకీలాద్రి) ఆలయం గురించి తెలియని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదు. ఇంద్రకీలాద్రి ఆలయం.. కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా, బెజవాడ కనక దుర్గమ్మగా వాసికెక్కింది. అందుకే ఇక్కడికొచ్చే భక్తులందరూ ముందుగా హనుమాన్ను దర్శించుకొని.. ఆపై అమ్మవారిని.. మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. అటువంటి మహోన్నత ఆలయం తాజాగా వివాదానికి కేంద్ర బిందువైంది. ఆలయ కార్యనిర్వహణాధికారిపై పాలక మండలి ఛైర్మన్ చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.
ఈవోపై పాలకమండలి ఛైర్మన్ విమర్శలు.. విజయవాడ ఇంద్రకీలాద్రి మరో వివాదానికి కేంద్రబిందువైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబను లక్ష్యంగా చేసుకుని పాలక మండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆలయ పరిపాలన అధికారిగా వ్యవహరిస్తోన్న ఈవో.. పాలక మండలి లేఖలను కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆదాయానికి మించి ఆస్తుల అభియోగాలతో అనిశా (అవినీతి నిరోధక శాఖ) అరెస్టు చేసిన దుర్గగుడి సూపరింటెండెంట్ వాసా నగేష్‌పై అనేక ఆరోపణలున్నప్పటికీ.. కీలక బాధ్యతలను అప్పగించడంలో ఔచిత్యం ఏంటని ఆయన నిలదీశారు. ఈ విషయాలన్నింటిని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఛైర్మన్ స్పష్టం చేశారు.
అనిశాతో ఉలిక్కిపడ్డ ఇంద్రకీలాద్రి.. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తోన్న వాసా నగేష్.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులు కేసు నమోదు చేయడం ఇంద్రకీలాద్రిని ఉలిక్కిపడేలా చేసింది. దుర్గమ్మ సన్నిధిలో అవినీతి అనకొండలదే రాజ్యంగా చలామణి అవుతోందనేది మరోసారి అనిశా సోదాలతో బయటపడింది. నగేష్ ఉంటోన్న విజయవాడ కుమ్మరిపాలెం లోటస్ లెజెండ్ అపార్ట్‌మెంట్ నివాసం సహా భీమడోలు, ద్వారకా తిరుమల, నిడదవోలు, విజయవాడ ఏవో కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలోనూ మరో 6 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపి భారీగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.
అవినీతి వ్యవహారం- దుర్గగుడిపై దుమారం..నగేష్ అవినీతి వ్యవహారం ఇప్పుడు దుర్గగుడిపై దుమారానికి తెరతీసింది. ద్వారకా తిరుమలలో నగేష్ పని చేసినప్పుడు అతని అవినీతిపై వచ్చిన ఫిర్యాదులకు విచారణ అధికారిగా దుర్గగుడి ఈవో భ్రమరాంబ వెళ్లి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని.. అనేక ఆరోపణలున్న వ్యక్తికి కీలక బాధ్యతలను ఎలా అప్పగిస్తారంటూ పాలక మండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు ఆరోపించారు. నగేష్‌పై తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులను, తమ పరిశీలనలో వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుని.. తాము ఈవోకు ఓ లేఖ ఇచ్చామని.. అతని బాధ్యతలు మార్చాలని కోరినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈవో తీరును విమర్శించారు.
ఈవోపై పాలక మండలి ఛైర్మన్ ఆగ్రహం ఆ బాధ్యత అందరి మీద ఉంటుంది.. పాలక మండలి వచ్చి మూడు నెలలైనా.. రెండో బోర్డు సమావేశం నుంచే తాము నగేష్ తీరును తప్పుపడుతున్నా చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటని ఛైర్మన్ నిలదీశారు. జీతంలో కోతతో విధులు నిర్వహిస్తోన్న సూపరింటెండెంట్‌కు కీలక బాధ్యతలు ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. నగేష్ ఓ పెద్ద లాబీయింగ్ మాస్టారని.. అతను అక్రమాలు అనిశా తనిఖీలతో మరింతగా బయటపడ్డాయన్నారు. పాలక మండలిని ఎంత మాత్రం ఈవో గౌరవించడంలేదని.. అల్లరి అవుతున్న పరిస్థితుల్లో చక్కదిద్దాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందని.. అందుకే ఈ విషయాన్ని కమిషనర్, దేవదాయ శాఖ మంత్రితో పాటు ప్రభుత్వ, పార్టీ ముఖ్యుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. దుర్గగుడిలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరుగుతున్నందున.. ఈవో అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్న సమయంలో ఛైర్మన్ మహామండపం ఆరో అంతస్తు వద్దకు వచ్చి.. నగేష్ వ్యవహారంపై అందరి ముందు ప్రశ్నించినట్టు సమాచారం.
సస్పెండ్ చేసేందుకు అధికారులు సిద్ధం..అంతేకాదు, అతని స్థానంలో ఎవరిని సూపరింటెండెంట్‌గా నియమిస్తున్నదీ వెంటనే చెప్పాలని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రస్తుతం హుండీ లెక్కింపు జరుగుతున్నందున ఈ విషయమై తర్వాత చర్చించి ఓ నిర్ణయం తీసుకుందామని చెప్పినా.. ఛైర్మన్ ఎంతమాత్రం పట్టించుకోకుండా తాను సూచించిన వ్యక్తిని నగేష్ స్థానంలో నియమించాలని పట్టుబట్టారని.. ఈవో నుంచి తక్షణ స్పందన లేకపోవడం ఛైర్మన్‌కు మరింత ఆగ్రహం తెప్పించినట్లు ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నగేష్‌పై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అ.ని.శా. నుంచి సమాచారం రాగానే అతన్ని సస్పెండ్ చేసేందుకు దేవస్థానం అధికారులు సిద్ధంగా ఉన్నారు. శోభకృత్ నామ సంవత్సర పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఉదయం ఐదున్నర గంటల నుంచి గిరిప్రదక్షిణ ఉన్నందున.. ఈవో, ఛైర్మన్ మధ్య వివాదం ఎంతవరకు వెళ్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి