Scrub Typhus : అకస్మాత్తుగా చర్మంపై నల్లటి మచ్చలు రావడంతోపాటు చలి, జ్వరం, తలనొప్పి ఉంటే.. స్క్రబ్ టైఫస్ బారిన పడినట్లు భావించాలని వైద్యులు చెబుతున్నారు. నల్లుల ఆకారంతో సూక్ష్మంగా కంటికి కనిపించని పురుగులు శరీరంపై కుట్టడం వల్ల.. కాలినట్లు మచ్చలు ఏర్పడతాయని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనీసం ఐదు రోజులపాటు ఉంటాయని తెలిపారు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు నిర్దారణ కోసం ప్రత్యేక పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. టైఫస్‌ను గుర్తించేందుకు వైద్యశాఖ ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ ఇస్తోందని అధికారులు చెబుతున్నారు.
ప్రాణాంతకమేమీ కాదు : సాధారణంగా జ్వరం ఎంతకీ తగ్గకపోతే డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌గా భావించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు తెలిపారు. మచ్చలు కనిపిస్తే మాత్రం ‘స్క్రబ్ టైఫస్’(బ్యాక్టీరియా) నిర్ధారణకు రక్తపరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. ‘స్క్రబ్ టైఫస్ ప్రాణాంతకం కాదని.. ప్రజలు దీనిపట్ల కంగారు పడాల్సిన అవసరం లేదు’ అని వైద్యులు చెబుతున్నారు. పురుగులు ఎక్కువగా ఛాతీ, పాదాలు, పొట్ట, బుగ్గలపై కుడుతుంటాయని వివరించారు.
స్క్రబ్ టైఫస్ గురించి అవగాహన లేక, లోతైన విశ్లేషణలు జరగక, నమూనాల్ని పరీక్షించక.. సమస్య తీవ్రతపై దేశ వ్యాప్తంగా స్పష్టత ఉండటం లేదు. ఈ నేపథ్యంలో స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రులలో విధులు నిర్వహించే.. ల్యాబ్ టెక్నీషియన్లకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. కిట్లను ఇచ్చి, ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఈ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది.
ఎలా సోకుతుంది : ఇళ్లలో, పెరటి మొక్కల్లో, చిత్తడి ప్రాంతాల్లో ఉండే నల్లుల వంటి చిన్న పురుగులు కుట్టడంతో స్క్రబ్ టైఫస్ సోకుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు చెబుతున్నారు. ఇంటిలో ఉండే మంచాలలో, తడి ప్రాంతాలలో ఈ పురుగులు ఉంటాయి. ఎక్కువగా రాత్రి సమయాల్లో ఇవి మనుషులపై దాడి చేస్తుంటాయని మైక్రోబయాలజిస్ట్ చెబుతున్నారు. చెట్లు అధికంగా ఉండే ప్రదేశంలో, వ్యవసాయ భూముల పక్కన నివసించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.