కనీస వేతనాల అమలుకై.. స్కీం వర్కర్స్ మహాధర్నా Scheme Workers Protest: అంగన్వాడి, ఆశా వర్కర్స్, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్కీం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వివిధ పథకాలలో పని చేస్తున్న అంగన్వాడి, ఆశా వర్కర్స్, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, హెల్పర్లు కనీస వేతనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చాక కనీస వేతనం అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నాలుగేళ్లు గడిచినా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వేతనాలను తక్షణమే చెల్లించాలన్నారు. వేతనం ప్రతి నెలా ఒకటవ తేదీనే ఇవ్వాలన్నారు. మెనూ ఛార్జీలను పెంచాలన్నారు.
స్కీం వర్కర్స్ కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, మరణించిన వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం కింద 10 లక్షల రూపాయలు చెల్లించాలన్నారు. స్కీమ్ వర్కర్స్కు సుప్రీంకోర్టు తీర్పు మేరకు వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రస్తుత బడ్జెట్లో స్కీం వర్కర్స్కు కనీస నిధులు కేటాయించాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
"ఈ రోజు రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న స్కీం వర్కర్స్.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల అమలు కోసం అంగన్వాడి, ఆశా వర్కర్స్, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు అతి తక్కువ వేతనాలు ఉన్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతున్న సందర్భంలో.. గౌరవ వేతనం ఇస్తూ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న స్కీం వర్కర్స్ అంతా కలిసి సామూహిక దీక్షను నిర్వహిస్తున్నాము". - లలిత, అంగన్వాడి వర్కర్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
"జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయంలో.. కార్మికుల సమస్యల గురించి కలిసినట్లయితే.. అధికారంలోని వచ్చిన తరువాత పరిష్కరిస్తామన్నారు. గౌరవం వేతన, మెస్ ఛార్జీలు పెంపుదల చేస్తామని ఇప్పటికీ చేయలేదు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల కష్టాలను ఏ విధంగా కూడా తీర్చలేదు". - స్రవంతి, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు
"ఆశాగా 1990ల నుంచి మేము పని చేస్తున్నాము. గౌరవ వేతనం అన్నారు. స్వచ్ఛందంగా తీసుకున్నాం అన్నారు. వెయ్యి జనాభాకు ఒక ఆశా కార్యకర్త అని అన్నారు. కానీ ప్రస్తుతం 1500 మందికి ఒక ఆశా కార్యకర్త అంటున్నారు. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతుంటే.. కాదు మీకు బడ్జెట్లో ప్రవేశ పెట్టాము అన్నారు. కానీ అవేవీ ఇచ్చిన దాఖలాలు లేవు". - శాంతి, ఆశా వర్కర్స్ సంఘం కార్యదర్శి
ఇవీ చదవండి: