ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో మరో భారీ మోసం.. ఉద్యోగాల పేరుతో భారీగా వసూళ్లు - డయల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ సంస్థ అధినేత సిద్దార్థ వర్మ

Jobs Fraud : ప్రాసెసింగ్‌ ఫీజు, సేఫ్టీ డిపాజిట్ కడితే చాలు ఆరు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ నమ్మిస్తారు. వీరి మాయమాటలు నమ్మి డబ్బులు చెల్లిస్తే అంతే సంగతులు. నిరుద్యోగుల నుంచి అందినకాడికి దోచుకుని జెండా ఎత్తేస్తారు. మోసపోయామని గ్రహించాక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. విజయవాడలో ఇలాంటి మోసం మరొకటి వెలుగులోకి వచ్చింది.

Jobs Fraud
ఉద్యోగం ఇప్పిస్తామంటు మోసం

By

Published : Dec 16, 2022, 1:35 PM IST

Jobs Scam : ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ఉన్నాయని విదేశాల్లో విమానాశ్రయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు పేరుతో ముందుగానే కొంత మొత్తం వసూలు చేశారు. విదేశాల్లో కార్గో సూపర్‌వైజర్‌ పోస్టుల కోసమని.. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద 50 వేలు కట్టించుకున్నారు. మరో పదివేలు కడితే ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికేట్‌ కూడా తామే ఇస్తామని నమ్మించారు. ఆ విధంగా ఒక్కొక్కరి నుంచి సుమారు 75వేల రూపాయలు వసూలు చేశారు. అమెరికా, దుబాయ్, ఇంగ్లండ్, మలేషియాల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో చాలా మంది నమ్మి డబ్బులు కట్టేశారు. కొంత మందికి ఎఫ్‌సీఐ, బీఎస్‌ఎన్‌ఎల్ లాంటి కేంద్ర సంస్థల్లోనూ ఉద్యోగాలిప్పిస్తామని లక్షల్లో వసూలు చేశారు. ఉద్యోగాలు రాక, కట్టిన డబ్బులు తిరిగి రాక.. కొంత మంది నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు.

వినుకొండకు చెందిన ఓ యువతి డిగ్రీ చదివారు. విమానాశ్రయాల్లో కార్గొ సూపర్‌వైజర్ అంటూ ఓ యాప్‌లో ప్రకటన చూసి డబ్బులు కట్టారు. మోసపోయానని గ్రహించాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మరో యువకుడు కూడా ఇదే రీతిలో మోసపోయాడు. ఇలా పదుల సంఖ్యలో బాధితులు విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసపోయారు. డయల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ పేరుతో 2021 నుంచి జరుగుతున్న ఈ మోసం బాధితులు పోలీసులను ఆశ్రయించటంతో బట్టబయలైంది.

"లోకల్​యాప్​లో ఉద్యోగాల పేరుతో యాడ్​ చూశాను. యాడ్​లో చూసిన వివరాలకు ఫోన్​ చేసి అడిగితే.. వాళ్ల ఆఫీస్​కి రమ్మని అన్నారు. అక్కడికి వెళ్లి వివరాలు అడిగితే.. నేషనల్​ హైవే, ఎలక్షన్​ కమిషన్​ లాంటి సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు. దానికి మూడు లక్షల రూపాయలు అడిగారు. అంతమొత్తంలో నేను ఇవ్వలేనని అన్నాను. బీఎస్​ఎన్​ఎల్​ అయితే సుమారు 50 వేల వరకు అవుతుంది అన్నారు. మొదట ఆరువేల రూపాయలు కట్టాము. వారం రోజుల గడువుతో 40 వేలు కట్టించుకున్నారు."- బాధితుడు

కొంత మంది నిరుద్యోగులు గతేడాదే డబ్బులు కట్టగా.. కొవిడ్‌ రెండోదశ కారణంగా ఉద్యోగాలు ఆగాయని నిర్వాహకులు నమ్మించారు. కరోనా ఉద్ధృతి తగ్గాక ప్రశ్నిస్తే ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేశారు. తరువాత కొంత మందికి ఇంటర్వ్యూలు చేసి పాస్‌పోర్టులు తెచ్చుకోవాలని చెప్పారు. తర్వాత ఒక్కసారిగా ఫోన్లు ఆపేసారు. చివరికి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డయల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ సంస్థ అధినేత సిద్దార్థ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

విజయవాడలో ఉద్యోగం ఇప్పిస్తామంటు భారీగా నగదు వసూలు చేసిన మోసగాళ్లు

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details