Sankranti Celebrations: రాష్ట్రంలోని వ్యాపార కూడళ్లు జనాలతో కిక్కిరిపోయాయి. కళాశాలల్లో విద్యార్థినిలు సంప్రదాయ వస్త్రాలు ధరించి పండగని జరుపుకున్నారు. డూడూ బసవన్న ఆటలు.. యువత పాటలతో కోలాహలం సంతరించుకుంది. నిత్యం పనితో కుస్తీ పట్టే ఉద్యోగులు.. సంబరాలు చేసుకుని తమ ఉత్సాహాన్ని కనబరిచారు.
భోగి మంటలు..ముగ్గుల పోటీలతో: విజయనగరంలోని శిల్పారామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి మంటలు, గంగిరెద్దు ఆటలు, ముగ్గుల పోటీలు, కోలాటం, సంప్రదాయ వంటకాల ప్రదర్శన.. నగరవాసులను అలరించాయి. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో పలువురు నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
"తెలుగు వారంతా.. ఎంతో సంతోషంగా, ఘనంగా జరుపుకునే పండగలలో ముఖ్యమైనది సంక్రాంతి. సంక్రాంతి పండగను పురష్కరించుకొని.. వివిధ ప్రాంతాలలో.. వివిధ రకాలుగా సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు". - కోలగట్ల వీరభద్రస్వామి, డిప్యూటీ స్పీకర్
నెల్లూరులో కోలాహలం:నెల్లూరు జిల్లాలో.. సంక్రాంతి సందడి నెలకొంది. కరోనా తరువాత పెద్ద ఎత్తున సంక్రాంతిని ప్రజలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు , కావలి, కందుకూరు పట్టణాల్లో వ్యాపార కూడళ్లలో కోలాహలం కనిపిస్తోంది. నెల్లూరు నగరంలోని సండే మార్కెట్, స్టౌన్ హౌస్ పేట, చిన్నబజారు, పెద్ద బజారుల్లో హోల్ సేల్ వస్త్ర దుకాణాలు, నిత్యవసర దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.
విశాఖలో ఉద్యోగులు:సంక్రాంతి సంబరాలు వివిధ ప్రదేశాల్లో పండగ వాతావరణం మరింతగా ప్రతిఫలించేట్టుగా చేస్తున్నాయి. విశాఖలోని వివిధ సంస్థలు తమ ఉద్యోగులను.. సిబ్బందిని ఇందులో భాగస్వాములు చేస్తున్నాయి. యువత ఈ సంబరాల్లో తమ ఉత్సాహాన్ని.. ఆనందాన్ని కనబరుస్తున్నారు. దీంతో సంక్రాంతి ముందస్తు వాతావరణం నెలకొంది.