Sankranti Celebrations: సంక్రాంతి సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో సందడిగా జరుగుతున్నాయి. పండగకు పట్టణాల నుంచి వచ్చినవారితో పల్లెలు సందడిగా మారాయి. ప్రతి ఇళ్లు కుటుంబసభ్యులు, బంధువులతో కళకళలాడుతున్నాయి. సొంతూరికి వచ్చినవాళ్లు తమ ఊర్లో అందాలను ఆస్వాదిస్తున్నారు. గ్రామస్థులంతా ఒక్కటై ఆడిపాడుతున్నారు. మహిళలకు ముగ్గులు, వంటపోటీలు నిర్వహిస్తున్నారు. పిల్లలు, యువకులు గాలిపటాలు ఎగురవేస్తూ కేరింతలు కొట్టారు.
బాపట్ల జిల్లాలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. చీరాల మండలం బోయినవారిపాలెంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. మొత్తం 25 జట్లు ఇందులో పాల్గొన్నాయి. యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు ఇచ్చారు.
ఔరా అనిపించిన ఎడ్ల బండ్ల పోటీలు: సంక్రాంతి వేడుకల్లో భాగంగా అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడలో నిర్వహించిన ఎడ్ల బండి పోటీలు ఆకట్టుకున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎడ్లబండి నిర్వాహకులు పోటీలో పాల్గొన్నారు. పోటీలను అధిక సంఖ్యలో ప్రజలు తిలకించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.
ట్రాక్టర్ పోటీలు: గుంటూరు జిల్లా కాకుమానులో మహిళలకు ముగ్గుల పోటీలు, పురుషులకు ట్రాక్టర్ రివర్స్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మాజీ న్యాయమూర్తి డాక్టర్ చుక్కా రిచల్ దేవవరం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయలు తెలిపే జీవన విధానమే సంక్రాంతి అని ఆమె అన్నారు. గ్రామస్థులు అందరూ ఒకే ప్రదేశానికి చేరి పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పోటీల వలన మహిళల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించవచ్చన్నారు. అనంతరం పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ఇచ్చారు.