SANKRANTHI SAMBARALU: హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు..! ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు..! వేకువజామునే జంగమదేవరల జేగంటలు, ఢమరుక నాదాలు..! అక్కడక్కడా పిట్టలదొరల బడాయి మాటలతో.. పట్టణాలు, పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి.
తెలుగు వంటకాలు, పల్లె వాతావరణాన్ని: విజయనగరం జిల్లాలోని లెండీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు సంక్రాంతి విశిష్ఠత తెలిపేందుకు "సంక్రాంతి సంబరాలు" పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. నోరురూరించే తెలుగు వంటకాలు, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా బొమ్మల కొలవులు ఏర్పాటు చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిన విద్యార్థులు..నృత్యాలు చేసి అలరించారు.
విభిన్న ఆకృతులు, రంగుల్లో ముగ్గులు: విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో స్థానిక వాజీ ఛానల్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. జిల్లా చరిత్రను తెలియచేసేలా మహిళలు విభిన్న ఆకృతులు, రంగుల్లో ముగ్గులను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో బుల్లితెర నటి జ్యోతిరాయ్, విజయనగరం మేయర్ విజయలక్ష్మీ పాల్గొన్నారు.