Sankalpasiddhi scandal: సంకల్ప సిద్ధి కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కిరణ్ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. గతంలో కూడా నిందితుడు 2, 3 సంవత్సరాల పాటు అజ్ఞాతంలోనే ఉండేవాడని పోలీసులు గుర్తించారు. అతన్ని విచారిస్తే కేసు ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. వ్యాపారాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు నియమించిన 14 మంది కోర్ కమిటీ ఏజెంట్లని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వీరితో పాటు కోటికి పైగా డిపాజిట్లు వసూలు చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
బంధువుల పేరిట ఆస్తులు.. ప్రకాశం జిల్లా కనిగిరి, కృష్ణా జిల్లా గన్నవరం, అనంతపురం, బళ్లారి, ఇలా పలు ప్రాంతాల్లో డిపాజిటర్ల సొమ్ముతో కొనుగోలు చేసిన స్థిర, చరాస్తులను అటాచ్‌మెంట్ చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటాచ్‌మెంట్‌ను చట్టబద్ధం చేసేందుకు పోలీసులు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ ప్రక్రియ త్వరలో పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వందల కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేశారు. విజయవాడలోని పటమట, సూర్యారావుపేట సైబర్ స్టేషన్లతో పాటు అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం పీఎస్‌లలోనూ కేసులు నమోదు అయ్యాయి. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గుత్తా వేణుగోపాలకృష్ణ.. పలు ఆస్తులను తన బంధువుల పేరిట రిజిస్టర్ చేసినట్లు విచారణలో తేలింది. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని డూప్లెక్స్ ఇంటిని రూ.1.15 కోట్లతో కొనుగోలు చేసి, వనిత అనే మహిళ పేరిట రిజిస్టర్ చేశారు. సంకల్ప సిద్ధి కుంభకోణం వెలుగులోకి వచ్చే రెండు నెలల ముందు రూ.5 కోట్లు వెచ్చించి బళ్లారిలోని భూములును ఈమె పేరిటే కొనుగోలు చేశారు. కర్ణాటకలోని హోస్పేటలో మరో రెండు ప్లాట్లను కూడా కొనుగోలు చేశారు.