ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sanitation in state : ఏదీ మురుగునీటి శుద్ధి..? జగన్‌ పాలనలో లోపించిన చిత్త'శుద్ధి'.. యథేచ్ఛగా నదుల్లోకి విడుదల! - ఏపీ వార్తలు

Worst Sanitation in YSRCP Government: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తామని చెప్పిన మాటను సీఎం జగన్‌ నీటిలో కలిపేశారు. రాష్ట్రంలో రోజుకు 2వేల882 మిలియన్‌ లీటర్ల మురుగునీరు వస్తుంటే.. అందులో శుభ్రం చేస్తున్నది 15 శాతమే. మిగిలిన నీరంతా నేరుగా నదులు, సముద్రంలో కలుస్తోంది. ఈ నీరు తాగిన ప్రజలు రోగాలబారిన పడుతున్నారు.

Sanitation in YSRCP Government
రాష్ట్రంలో పారిశుధ్యం పరిస్థితి

By

Published : Aug 1, 2023, 1:48 PM IST

Poor Sanitation Troubles in AP : ప్రజారోగ్యం విషయంలో వైసీపీ సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. మురుగు నీటిని యథేచ్ఛగా నదుల్లో కలిపేస్తోంది. వాస్తవానికి.. మురుగునీరు నేరుగా నదుల్లో కలవకుండా కర్నూలు, మాచర్ల, మంగళగిరి-తాడేపల్లిలో మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. విజయవాడ, గుంటూరు, నెల్లూరులోనూ శుద్ధి చేసిన నీటినే నదుల్లో విడిచిపెట్టాలి. అన్ని పట్టణాల్లోనూ ఘన వ్యర్థాల యాజమాన్య కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. ఇదీ 2021 జులై 30న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ చెప్పింది. కానీ రాష్ట్రంలో పారిశుధ్యం పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

సీఎం గారూ.. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇదేనా?

రాష్ట్రంలో పుర, నగరపాలక సంస్థల్లో రోజూ వస్తున్న 2,882 మిలియన్‌ లీటర్ల మురుగునీటిలో కేవలం 15 శాతమే శుద్ధి చేస్తున్నారు. మిగిలిన నీటిని నేరుగా నదులు, సముద్రంలోకే విడిచిపెడుతున్నారు. రోజూ 833 మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యంగల కేంద్రాలు ఉన్నా.. నిర్వహణ లోపంతో కొన్నిచోట్లే పని చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అమృత్‌ పథకంలో 21 మురుగునీటి శుద్ధి కేంద్రాల పనులు ప్రారంభించగా వాటిలో వైసీపీ ప్రభుత్వం ఐదే పూర్తి చేసింది. పలు నీటి అవసరాలకు నదులపై ఆధారపడిన ప్రజలు ఈ కలుషిత నీటితో ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నా.. జగన్‌ సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదు.

మురుగునీటిని శుద్ధి చేశాకే నదుల్లో, సముద్రంలో విడిచి పెట్టాలన్న జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అమృత్‌ పథకంలో ప్రారంభించిన మురుగునీటి శుద్ధి కేంద్రాల పనులు పూర్తి చేయడం లేదు. తుంగభద్ర, కుందు, గోదావరి, నాగావళి, కృష్ణా నదుల్లో రోజూ 15 కోట్ల లీటర్లకుపైగా మురుగునీరు కలుస్తున్నట్లు అంచనా.

ఈ మురుగు చూశారా? :విజయవాడలో రోజూ 3-5 కోట్ల లీటర్ల మురుగు నీరు కృష్ణా నదిలో దాదాపు 80 చోట్ల కలుస్తోంది. ప్రత్యేకించి రైవెస్, బందరు, ఏలూరు కాలువల్లో నుంచి మురుగునీరు పలు చోట్ల నదిలోకి వెళుతోంది. విశాఖలో ఆర్కేబీచ్, వాసవానిపాలెం తదితర ప్రాంతాల్లో మురుగు నీరు నేరుగా సముద్రంలో కలుస్తోంది. నీటిని శుద్ధి చేసే కేంద్రాలు సముద్రం ఒడ్డున ఉన్నా పూర్తి సామర్థ్యంతో పని చేయడం లేదు. రాజమహేంద్రవరం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే 6 కోట్ల లీటర్ల మురుగు నీటిలో సగానికిపైగా శుద్ధి చేయకుండానే గోదావరి నదిలో చేరుతోంది.

ఇక్కడ నీటి శుద్ధి కేంద్రాల నిర్వహణలో పలు లోపాలున్నాయి. అదనపు కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలు పట్టాలెక్కలేదు. కర్నూలు నగరంలో నుంచి 4 కోట్ల లీటర్ల మురుగు నీరు తుంగభద్రలో కలుస్తోంది. నది ఒడ్డున అదనపు శుద్ధి కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. నెల్లూరులో టీడీపీ హయాంలో ప్రారంభించిన మురుగునీటి వ్యవస్థ పనులు ఇప్పటికీ పూర్తి కానందున మురుగు నేరుగా పెన్నా నదిలో కలుస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి, పల్నాడు జిల్లా మాచర్లలో మురుగు నీరు అత్యధిక శాతం నదులు, తాగునీరు, పంట కాలువల్లోకే పంపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details