Samagra Shiksha abhiyan Employees Chalo Vijayawada Program:చలో విజయవాడ పేరుతో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు గళమెత్తారు. చాలీచాలని వేతనాలతో కుటుంబ భారం కష్టంగా మారిందని వాపోయారు. 4 నెలలుగా జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఉద్యోగులు డిమాండ్ చేశారు. పార్ట్ టైమ్ ఉద్యోగుల పేరుతో తమతో చాకిరి చెయ్యిస్తున్నారని సమగ్ర శిక్షా ఉద్యోగులు వాపోయారు. కడుపు మండిన ఉద్యోగులు, తమ సమస్యలు పరిష్కరించాలని చలో విజయవాడ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సీఎం జగన్ మాటిచ్చి మోసం చేశారు: విద్యాశాఖ పరిధిలోని సమగ్రశిక్షా అభియాన్‌లో, సుమారు 26వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉపాధ్యాయులుగా, అకౌంటెంట్లుగా, రికార్డు అసిస్టెంట్లుగా ఇలా సుమారు 20 విభాగాల్లో పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు కనీస వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యంవహిస్తోందని సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులు ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు సీఎం జగన్ మాటిచ్చి మోసం చేశారని, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇచ్చే అరకొర వేతనాలనూ సమయానికి చెల్లించడం లేదని మండిపడ్డారు.
4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఇలా అయితే, తాము ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే, పిల్లల చదువులు, ఇతర ఖర్చులు కష్టంగా మారిందని ఉద్యోగులు వాపోయారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం తమని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.