YSR Rythu Bharosa Scheme Funds: ఇది 2019 అక్టోబరు 15న నెల్లూరులో రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు. ఏటా సంక్రాంతి పండుగకు ముందే రైతు భరోసా కింద 2వేల రూపాయల చొప్పున ఇస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఈ ఏడాది ఇంకా బటన్ నొక్కలేదు. పండగ పోయి పదిరోజులైనా 11వందల కోట్లకుపైగా నిధుల్ని విడుదల చేయలేదు. ఎప్పుడు తమ ఖాతాల్లో నిధులు జమ అవుతాయా అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్లలో 50వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక దానిని మరింత పెంచి 67వేల500 ఇస్తామని నమ్మబలికారు. ఐతే తొలి ఏడాది నుంచే పథకం అమలులో మడత పేచీలు పెడుతున్నారు. ఏటా విత్తనం వేయడానికి ముందే ఒక్కో రైతుకు 12వేల 500 ఇస్తామని చెప్పి చివరకు 3 విడతల్లో 7వేల 500 రూపాయలు ఇచ్చి సరిపెడుతున్నారు. అప్పటికే అమల్లో ఉన్న పీఎం కిసాన్‌తో కలిపి 13వేల500 రూపాయలు ఇస్తామని గొప్పగా చెబుతున్నారు.
రాష్ట్రంలో 70 లక్షల మంది రైతుల కుటుంబాలకు ఏడాదికి 8వేల750 కోట్లను అందిస్తామని 2019 జులై 12న అసెంబ్లీలో చెప్పిన జగన్.. దాని అమల్లోనూ మడమ తిప్పారు. రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య గత మూడేళ్లలో ఎప్పుడూ 53 లక్షలకు మించలేదు. మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చింది 11వేల 661 కోట్ల రూపాయలే. అందులో 3వేల 108 కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నుంచే ఖర్చు చేశారు. మూడేళ్లలో రైతులకు ఇచ్చిన మొత్తం నిధుల్లో కేంద్రం వాటా 42% ఉంది.
ప్రతి రైతు కుటుంబానికి పంట పెట్టుబడి కోసం 50వేల రూపాయలిస్తామని ముఖ్యమంత్రి చెప్పినా రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చేది 37వేల 500 రూపాయలు మాత్రమే. పీఎం కిసాన్ కింద విడతకు 2వేల రూపాయల చొప్పున మూడు దఫాలుగా ఇచ్చే 6వేల రూపాయలను తమ ఖాతాలో కలిపేసి ఏడాదికి 13వేల 500 రూపాయలిస్తామని గొప్పగా చెబుతున్నారు.