Round Table Meeting of Opposition Leaders in Support of Strikes : అంగన్వాడీ, మున్సిపల్, సర్వశిక్షా అభియాన్ రంగాలలో నిరవధిక సమ్మెలు రాష్ట్రంలో జరుగుతుంటే సీఎం జగన్‌కు పట్టడం లేదని అఖిలపక్ష నేతలు విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని జగన్‌ను మరో మూడు నెలల్లో సాగునంపుతారని మండిపడ్డారు. సీపీఎం ఆధ్వర్యంలో 'ఎస్మా వద్దు - జీతాలు పెంచండి' అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు జగన్ సర్కార్‌ను దుయ్యబట్టారు. అంగన్వాడీలు డిసెంబర్ 12న, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు డిసెంబర్ 20న, మున్సిపల్ కార్మికులు డిసెంబర్ 26న నుంచి సమ్మెలు చేస్తుంటే వారితో చర్చించి సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమని విమర్శించారు.
'ఎస్మా వద్దు - జీతాలు పెంచండి' నినాదంతో విపక్ష నేతలు రౌండ్ టేబుల్ సమావేశం అంగన్వాడీల సమ్మె అణచివేతకు ప్రభుత్వం కుట్ర పన్నింది: పట్టాభిరామ్
Anganwadi Workers Strike : అంగన్వాడీలు లక్ష మందికి పైగా పిల్లలు, మహిళలు, గర్భిణీలకు సేవలందిస్తున్నారని అలాంటి వారి సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని అఖిలపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాలలో సేవలు పొందుతున్న వారిలో అధిక శాతం మంది పేదలేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణాలోకన్నా వెయ్యి రూపాయలు అదనంగా వేతనం పెంచాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుండా దుర్మార్గంగా ఎస్మాను ప్రయోగించిందని దుయ్యబట్టారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడం, జనవరి 5వ తేదీలోగా విధులకు హాజరు కాకుంటే తొలగిస్తామని నోటీసుల్వివడం వంటి చర్యలకు ప్రభుత్వం పూనుకోవడం అప్రజాస్వామికం అని అన్నారు. జనవరి 8వ తేదీలోగా విధుల్లోకి చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గమన్నారు.
సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదు - 25వ రోజుకు చేరిన అంగన్వాడీల ఆందోళన
"సంక్రాంతి పండుగలోపు కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే విపక్ష పార్టీలన్నీ బంద్‌కు పిలుపునిస్తాం. కార్మికుల పట్ల దుర్మార్గమైన చర్యలు తీసుకుంటే చూస్తూ ఊరుకోము. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం" - శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
"చిన్న ఉద్యోగులకు రూ.1000,రూ.2000 పెంచడానికి నిధులు లేవని, రూ.450 కోట్ల బిల్డింగ్లు కట్టాడానికి ఎట్లా ఖర్చు చేశావు. తన అధికారంలో ఎవరిని ఖాతరు చేయరు. సుప్రీంకోర్టు తీర్పును లెక్కచేయడు. చట్టాన్ని గౌరవించాడు. తాను చెప్పిన హామీని నెరవేర్చడు. తెలంగాణ ప్రభుత్వం కన్నా ఎక్కువ వేతనాలు ఇస్తానని తనే చెప్పాడు. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు ఇక్కడైనా ఇవ్వాలి కదా" -రామకృష్ణ, సీపీఐ కార్యదర్శి
Municipal Workers Strike :మున్సిపల్ కార్మికులు గత 15 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నా ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని అఖిలపక్ష నేతలు విమర్శించారు. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి మున్సిపల్ కార్మికులు సేవలందించారన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అన్ని కేడర్లకు వేతనాలు పెంచాలని, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడిని పోలీసుల సహాయంతో అణచివేయడం అన్ని పార్టీల నేతలు ఖండించారు. సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులు 19 రోజులుగా 12 వేల మంది సమ్మెలో ఉన్నారని తెలియజేశారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. వేతనాలు పెంచాలని, మినిమమ్ టైమ్ స్కేల్ నిబంధనల ప్రకారం హ్యూమన్ రిసోర్స్ పాలసీని అమలు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, చైల్డ్ కేర్ లీవ్‌లు, విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. సమ్మె డిమాండ్లను పరిష్కరించకుండా 3 వేల మందికి ఉద్యోగులకు షోకాజు నోటీసులు ఇవ్వడం, దాదాపు 200 మందికి టెర్మినేషన్లను ఇవ్వడాన్ని నేతలు ఖండించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీలు
"ప్రభుత్వాలు ఇప్పుడైనా మేల్కోవాలి. అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించాలని మేము కోరుతున్నాం. రౌండ్ టేబుల్ సమవేశంలో తీసుకున్నా నిర్ణయానికి జై భారత్ నేషనల్ పార్టీ సంపూర్ణ మద్ధతు తెలుపుతుంది. మనం ఏ విధంగా ప్రభుత్వాన్ని కిందకు తీసుకువచ్చి కార్మికుల సమ్యసలు, డిమాండ్లు పరిష్కరం అయ్యేటట్లు మనంతా చూసుకోవాలి" -జేడీ లక్ష్మీనారాయణ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు
అంగన్వాడీ, మున్సిపల్, సమగ్ర శిక్షా కార్మికుల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతిలోగా పరిష్కరించాలని, లేకపోతే రాజకీయ పార్టీలన్నీ ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటాయని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.