Bribes in Mutation of Lands: రైతుల భూముల మ్యుటేషన్.. రెవెన్యూ సిబ్బందికి కాసులు కురిపిస్తోంది. ముడుపులు ఇచ్చుకోకుంటే భూరికార్డుల్లో కొత్త వివరాలు నమోదు చేయడం లేదు. మ్యుటేషన్ జరగకుంటే బ్యాంకుల నుంచి రుణాలు వంటి సౌకర్యాలను అన్నదాతలు పొందలేరు. మ్యుటేషన్ కోసం దరఖాస్తులు స్వీకరించిన 21 రోజుల్లోగా పరిష్కరించకుంటే కారణాలు తెలపాలని రెవెన్యూశాఖ నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో కొన్నిచోట్ల సిబ్బంది కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. దరఖాస్తు చేయకముందే రైతులతో వీఆర్వోలు బేరాలు కుదుర్చుకుంటున్నారు. ఆ తర్వాత వీఆర్వో నుంచి వచ్చే మౌఖిక ఆదేశాలతో గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్.. సంబంధిత రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించే సంస్కృతి మొదలైంది. స్వీకరణకు ముందే ఒప్పందాలు జరుగుతన్నందున.. 21 రోజుల్లోగా దరఖాస్తులు పరిష్కారమవుతున్నాయి. ఒక్కో రైతు నుంచి వసూలు చేసిన మొత్తంలో వీఆర్వో నుంచి.. 3, 4 అంచెల్లో తహసీల్దార్ల వరకూ వాటాల పంపిణీ జరుగుతోంది.
భూముల బదలాయింపు..లేదంటే రికార్డుల్లో తప్పుల సవరణ కోసం రైతులు దరఖాస్తు చేస్తే.. వీటిపై వీఆర్వో విచారణ జరిపి.. 15 రోజుల్లోగా సిఫార్సు చేయాలనిగానీ లేదా తిరస్కరించాలని గానీ తహసీల్దారుకు నివేదిస్తారు. దీనిపై తహసీల్దారు వారంలోగా నిర్ణయం తీసుకోవాలి. దీన్ని అనుసరించి రికార్డుల్లో మార్పులు, పట్టాదారు పాసు పుస్తకాల జారీ జరుగుతుంది. కొందరు నిబంధనల ప్రకారం మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసినా.. వెంటనే వీఆర్వోలు కలుగజేసుకుని మెలికలు ఏదో ఒక కొర్రీ పెడుతున్నారు. వారు అడిగినంత ముడుపులిస్తే ఈ వేధింపులేవీ ఉండవు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను విచారణ అనంతరం తహసీల్దారుకు వీఆర్వోలు తెలియజేస్తూనే.. మాన్యువల్ విధానంలో ఆర్‌ఐ, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దారు వరకు వివరించాల్సి ఉన్నందున.. అవినీతితోపాటు వాటాలూ పెరుగుతున్నాయి.