Revanth Reddy Padayatra: తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 6న భద్రాచలం నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తాను చేపట్టే పాదయాత్ర రెండు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు. టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో.. పాదయాత్రతో పాటు ఈ నెల 26నుంచి చేపట్టే హాథ్ సే హాథ్ జోడో యాత్ర ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ యాత్రలో ఏదో ఒక రోజు ప్రియాంక గాంధీ లేకపోతే సోనియాగాంధీ పాల్గొనేలా తీర్మానం చేస్తున్నామని చెప్పారు. గాంధీభవన్‌లో నిర్వహించిన ఓ సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక నుంచి ఠాక్రే హజరయ్యే సమావేశాలకు మూడు సార్లు రాకపోతే ఎందుకు రాలేదో వివరణ తీసుకుంటామని రేవంత్‌రెడ్డి వివరించారు. కీలక సమయాల్లో.. సమావేశానికి రాని వారిని పార్టీ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డిపై అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. నాగర్ కర్నూల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
దేశ సమగ్రతను కాపాడేది కాంగ్రెస్: రాహుల్ గాంధీ ఈ నెల 30వ తేదీన శ్రీనగర్‌లో జాతీయజెండా ఎగురవేస్తారని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. భద్రతా కారణాలు చూపి జనవరి 26న ఆయనను శ్రీనగర్‌లో జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. దేశ సమగ్రతను కాపాడేది కాంగ్రెస్ అని.. ప్రజలకు రాహుల్ గాంధీ నమ్మకం కలిగించారని తెలిపారు. దీనిపై బీజేపీ చిల్లర ఆరోపణలు చేస్తుందని రేవంత్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు
అంతకుముందు గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై పాదయాత్ర చేయాలంటూ పలువురు నేతల నుంచి డిమాండ్ వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాదయాత్ర చేస్తునే.. కాంగ్రెస్ పార్టీ బతుకుతుందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ పేర్కొనారు. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని మాజీ మంత్రి కొండా సురేఖ వివరించారు.