Revanth Reddy PadaYatra: రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో త్రిపుల్ వన్ జీవో నుంచి వెయ్యి ఎకరాలను మినహాయించిన మంత్రి కేటీఆర్.. రూ.5 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించారన్న ఆయన.. ఈపీఆర్ఆర్ఐ, జవహర్ కమిటీ నివేదికలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా కామేపల్లిలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. భూ దందా ఆరోపణలపై తన ఆస్తులు, కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ ఛార్జీల పేరిట పేదలను బీఆర్ఎస్ సర్కార్ ఇబ్బందులు పెడుతోందని రేవంత్ విమర్శించారు. ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, గోపాల్‌రావు వల్లే విద్యుత్ సంస్థలు అప్పుల్లో మునిగాయని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వీరంతా ఊచలు లెక్కించక తప్పదని హెచ్చరించారు. కరెంటు పోరాటంలో వామపక్షాలు కలిసి రావాలని కోరారు. ధరణి పోర్టల్‌ను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారని తెలిపారు.