V. Gopala Gowda on Amaravati issue: అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి.గోపాల గౌడ తప్పుబట్టారు. అమరావతి గత రాజధానిపై ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఈ ప్రభుత్వం ఉల్లంఘించిందని తెలిపారు. ఫోరం ఫర్ డెమోక్రటిసీ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన చట్టబద్ధ పాలన - భారత ప్రజాస్వామ్యం అనే చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అమరావతి కోసం రైతులు అనేక విధాలుగా పోరాటం చేస్తున్నారని పెర్కొన్నారు. ప్రభుత్వ ఉల్లంఘనలకు అమరావతి రాజధాని అంశమే ప్రత్యక్ష నిదర్శనమన్నారు.
రాష్ట్రం తెచ్చిన జీవో 1 ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని జస్టిస్ గోపాలగౌడ అన్నారు. పోలీస్ శాఖలో కొందరు ప్రైవేట్ ఆర్మీలా మారి ప్రభుత్వానికి పని చేస్తూన్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులు వైజాగ్ లో పర్యటనలు చేస్తుంటే ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు వెళ్తుంటే కారులోనే కూర్చోవాలని పోలీసులు ఆదేశిస్తున్నారని పరోక్షంగా పవన్ కళ్యాణ్ విశాఖ పర్యాటన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.