COMMISSION ON KAKNDUKURU INCIDENT : నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలపై విజయవాడ ప్రభుత్వ అతిథి గృహంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషశయనా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ విచారణ చేపట్టింది. ఈ విచారణకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇంటూరి నాగేశ్వరరావు, తెనాలి శ్రావణ్ కుమార్లు హాజరయ్యారు. విచారణ అనంతరం టీడీపీ నేతలు పలు విమర్శలు చేశారు.
కందుకూరు ఘటనపై వైఎస్సార్సీపీ కార్యకర్తలనే సాక్షులుగా పెట్టించి అధికారులు అసత్యాలు చెప్పిస్తున్నారని కందుకూరు తెలుగుదేశం ఇంఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆరోపించారు. సాక్ష్యాలు చెప్పడానికి వచ్చిన వారంతా అధికార పార్టీ నేతలే అనే నిజాన్ని తాము వచ్చే విచారణలో నిరూపిస్తామని స్పష్టం చేశారు. అసలు ఆ కార్యక్రమంతో సంబంధం లేకుండా అక్కడకు ఎలా వచ్చారో కూడా వారు చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారని.. అన్ని ఆధారాలతో మళ్లీ వస్తామని వెల్లడించారు.
గుంటూరు ఘటనలో క్షతగాత్రులు, పాత్రధారులను క్రాస్ ఎగ్జామ్ చేస్తారా అని అడిగారని గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం నేత తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. తాము అనుమతి తీసుకునే కార్యక్రమం నిర్వహించామని విచారణలో చెప్పినట్లు తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకలు ప్రజల మధ్య జరుపుకునేందుకు చంద్రబాబు వచ్చారని.. దురదృష్టవశాత్తు ఆరోజు ఈ విషాదకర ఘటన జరిగిందన్నారు. అనుమతికి సంబంధించిన పత్రాలు అన్నీ ఉన్నట్లు కమిషన్కు చెప్పినట్లు తెలిపారు. తమ దగ్గర ఉన్న అన్ని ఆధారాలను కమిషన్కు అందజేశామని తెలిపారు.