Retired AP Govt Pensioners EKYC Troubles Latest News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగ పింఛనుదారులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పింఛనుదారులకు, ఉద్యోగులకు ఈకేవైసీని తప్పనిసరి చేస్తూ.. ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఆనాలోచిత నిర్ణయం వల్ల దాదాపు 3,60,000 మంది విశ్రాంత్ర ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి పెన్షన్‌దారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలనే ప్రభుత్వ నిబంధన వల్ల పెన్షనర్లు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నామని వాపోతున్నారు.
ఈకేవైసీ తప్పనిసరి.. ఈ ఏడాది జనవరి నెలలో విశ్రాంత ఉద్యోగ పింఛనుదారులు, ఉద్యోగులు ఈకేవైసీని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవోను విడుదల చేసింది. ఆ జీవోలో.. ప్రభుత్వ ఆదేశాల మేరకు పింఛనుదారులంతా తప్పకుండా జీవన ధ్రువపత్రాలు సమర్పించి, ఈకేవైసీని చేయించుకోవాలని పేర్కొంది. హెర్బ్ యాప్ సాయంతో సంబంధిత పింఛనుదారుడు తన సీఎఫ్‌ఎంఎస్ ఐడీకి ఈకేవైసీ చేయించి, ఆ వివరాలను ఉప ఖజానా అధికారికి ఆన్‌లైన్‌లో పంపించాలని తెలిపింది. ఆధార్‌కు అనుసంధానమైన చరవాణి నంబరునే వినియోగించాలని, జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా గానీ, హెచ్‌సీఎం పెన్షన్ లాగిన్ ద్వారా గానీ పత్రాలను సమర్పించాలని వెల్లడించింది.
ఈకేవైసీపై ట్రెజరీ అధికారులు ప్రకటన.. తాజాగా ఈకేవైసీకి సంబంధించి ఆయా జిల్లాల ట్రెజరీ అధికారులు మరో ప్రకటన చేశారు. ఈనెల 10వ తేదీలోపు ఈకేవైసీ చేయించుకోవాలని.. దీనికోసం జిల్లాలోని పింఛనుదారులు వారి సీఎఫ్ఎంఎస్ ఐడీకి ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబడిన ఫోన్ నెంబర్‌ను, ప్రస్తుత నివాస చిరునామాను విధిగా నమోదు చేసుకోవాలన్నారు. అప్పటి ఫోన్ నంబరు అందుబాటులో లేకపోతే ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఫోన్ నెంబర్‌ను ఆధార్ కార్డుతో అప్డేట్ చేయించుకోవాలన్నారు. ఆ తర్వాత జిల్లాలోని ట్రెజరీ కార్యాలయాలకు లేదా పెన్షనర్ అసోసియేషన్ కార్యాలయాలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని కోరారు.
3,60,000 మంది విశ్రాంత్ర ఉద్యోగులున్నారు.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈకేవైసీ విధానంపై ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈకేవైసీ కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల దాదాపు 3,60,000 మంది విశ్రాంత్ర ఉద్యోగులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని ఆవేదన చెందుతున్నారని.. పెన్షన్‌దారుల సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మే 10వ తేదీ నాటికి పెన్షన్‌దారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం గడువు పెట్టడం దారుణమని వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల 60 వేల మంది పెన్షన్‌దారులు ఉండగా, వారిలో సుమారు లక్ష పాతిక వేల మంది కుటుంబ పెన్షనర్లు ఉన్నారని.. ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు.