AP JAC Amaravati members met with AP CS: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి.. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ లిఖితపూర్వకంగా ఇస్తేనే.. రేపటి నుంచి తలపెట్టిన ఆందోళన విరమణపై ఆలోచన చేస్తామని.. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉద్యోగుల పెండింగ్ అంశాలకు సంబంధించి నేడు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డితో ఏపీ ఐకాస అమరావతి ప్రతినిధులు భేటీ అయ్యారు.
భేటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈరోజు రాత్రి వరకూ.. నిన్నటి సమావేశంలో మంత్రుల కమిటీ ఇచ్చిన హామీ మేరకు.. మార్చి నెలాఖరులోపు పెండింగ్‌లో ఉన్న ఆర్ధిక అంశాలను పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా రాసివ్వాలని సీఎస్‌ను కోరామని, లేనిపక్షంలో రేపు తలపెట్టిన నల్ల రిబ్బన్ల నిరసన కొనసాగుతుందనే అంశాన్ని.. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డికి స్పష్టంగా వివరించామని బొప్పరాజు తెలిపారు. సీఎస్ సూచన మేరకే ఈరోజు క్యాంపు కార్యాలయానికి వెళ్లామన్నారు.
అనంతరం పీఆర్సీ బకాయిలు, కొత్త డీఏలు వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, లిఖితపూర్వకంగా మినిట్స్ రూపంలో ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డిని స్పష్టంగా కోరామన్నారు. దానికి ఆయన ఈరోజు సాయంత్రంలోపు మినిట్స్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. సాయంత్రంలోపు మినిట్స్ ఇస్తే రేపు ఉదయం కార్యవర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో మధ్యాహ్నంకల్లా ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ సాయంత్రంలోపు మినిట్స్ గనక ఇవ్వకపోతే.. యథావిధిగా తమ కార్యాచరణ సాగుతుందని బొప్పరాజు పేర్కొన్నారు.