RBI WARNED STATE: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ కల్పించే అన్ని రకాల ఆర్థిక వెసులుబాట్లను రాష్ట్రం ఇప్పటికే వినియోగించేసుకుంది. ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం, చేబదుళ్ల పరిమితి దాటిపోవడంతో పాటు ఓవర్ డ్రాఫ్ట్ లోనే డిసెంబర్ నెల తొలి రోజులన్నీ గడిచిపోతున్నాయి. ఈ త్రైమాసికంలో ఇప్పటికే 19 రోజులు రాష్ట్రం ఓడీలోనే ఉంది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే డిసెంబర్ 17 నాటికి మిగిలిన 14 రోజుల పరిమితీ దాటిపోతుందని ఆర్‌బీఐ రాష్ట్రాన్ని హెచ్చరించింది. ఇప్పటికే లెక్కకు మిక్కిలి అప్పులు చేయడంతో సెక్యూరిటీ వేలంలోనూ పాల్గొనలేని పరిస్థితి.
అప్పూ పుట్టని పరిస్థితి: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. ఈ నెల 8 వరకు కూడా రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్‌లోనే ఉంది. తాజా పరిస్థితులు కూడా అదే స్థాయిలో ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిస్థితుల్లో మిగిలిన ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు అందాలంటే 2 వేల కోట్లు అవసరం. దీంతో డిసెంబరు నెల చాలా భారంగా గడుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మరీ ఇబ్బందికరంగా ఉన్నాయి. మొన్నటి వరకు అప్పు చేసి రోజులు నెట్టుకొచ్చారు. ఇప్పుడు అప్పూ పుట్టని పరిస్థితి. వరుసగా రెండో వారం కూడా ప్రభుత్వం సెక్యూరిటీల వేలంలో పాల్గొనడం లేదు. ఆర్‌బీఐ వెలువరించిన సెక్యూరిటీల వేలం బులెటిన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఈ మంగళవారం బహిరంగ మార్కెట్ రుణం తీసుకోవడం లేదు. ఇప్పటికే లెక్కకు మిక్కిలి అప్పులు చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. తొలి తొమ్మిది నెలల కాలానికి కేంద్రం ఇచ్చిన రుణ పరిమితి దాటిపోవడం, తర్వాత విద్యుత్తు సంస్కరణల అమలు రూపేణా ఇచ్చిన అదనపు నిధులు వాడేసుకున్న నేపథ్యంలో ఇక అప్పు తీసుకునే పరిస్థితి కూడా లేదు. దీంతో రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్‌లో ఉంటోంది. వచ్చిన రాబడులను వచ్చినట్లుగా ఓడీ నుంచి బయటపడేందుకే వెచ్చించాల్సి వస్తోంది.