Razole MLA Rapaka Varaprasad : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశానికి క్రాస్ ఓట్ వేస్తే పది కోట్లు తనకు ముట్టేవని.. ఆ పార్టీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం అంతర్వేదిలో వైసీపీ ఆత్మీయ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి బేరం తనకే వచ్చిందని.. ఈ ఆఫర్‌ను తాను తిరస్కరించానని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం ఎమ్మెల్యే రామరాజు తన వద్ద ఈ ప్రతిపాదన చేశారని చెప్పారు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాజోలు మండలం కడలిలో రాపాక వివరణ ఇచ్చారు. పార్టీలో నీతినిజాయతీలతో పని చేయాలి, అవినీతికి పాల్పడకూడదని ఒకవేళ తప్పు ఓటేస్తే పది కోట్లు వచ్చేవని అన్నానని చెప్పారు. ఎమ్మెల్యే రామరాజు తనతో పాటు తన స్నేహితుడు, వైసీపీ నాయకుడు కేఎస్ఎన్ రాజుతో కూడా ఇదే అంశం ప్రస్తావించారని.. ఆయన మా ఎమ్మెల్యే అలాంటివాడు కాదని తిరస్కరించినట్టు రాపాక చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాలుగు రోజుల తర్వాత రాపాక చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓట్ వేస్తే నాకు రూ.10కోట్లు వచ్చేవి : రాజోలు ఎమ్మెల్యే అసలు రాపాక ఎమన్నారంటే : 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి బేరం నాకే వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు తనని ఓటు వేయాలని అడిగారు. ఆ ప్రతిపాదనను నేను తిరస్కరించాను. అసెంబ్లీ దగ్గర కూడా ఒకరు తెలుగుదేశానికి ఓటేయమని నన్ను అడిగారు. ముఖ్యమంత్రి జగన్‌ను నమ్మినందున తెలుగుదేశం ప్రతిపాదనను తిరస్కరించాను' అని రాపాక వివరించారు.
ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయాడానికే: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్ద మంచి మార్కులు కొట్టేయడానికే తెలుగుదేశం పార్టీపై, తనపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఉండి ఎమ్మెల్యే రామరాజు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే పది కోట్లు ఇస్తామనీ ప్రకటించినట్లు రాపాక వరప్రసాద్ చెప్పడాన్ని రామరాజు ఖండించారు. అంత నీతి నిజాయితీ ఉన్న సభ్యుడైతే.. తాను ఏ పార్టీ నుంచి గెలిచి ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసుకోవాలని రామరాజు హితవు పలికారు. సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతుంటామని అలాంటిది ఈ పది కోట్ల ప్రస్తావన ఎన్నడూ రాలేదని రామరాజు వివరణ ఇచ్చారు. తమకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉంది కాబట్టే పంచుమర్తి అనురాధను అభ్యర్థిగా ప్రకటించామని రామరాజు స్పష్టం చేశారు.
అమ్ముడుపోయిన రాపాకను ఎవరూ నమ్మరు: తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా విమర్శించారు. ఆయన ఇప్పటికే వైసీపీకి అమ్ముడు పోయారని అన్నారు. రాపాక ఒక చిల్లర మనిషి అని దుయ్యబట్టారు. జనసేనలో గెలిచి వైసీపీకి అమ్ముడుపోయిన రాపాకను ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు. తమ 23 ఓట్లు తమకే వచ్చాయని ఉమా తెలిపారు. టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. తనను ఓటేయమని అడిగిన రోజే రాపాక మీడియాతో ఎందుకు చెప్పలేదని నిలదీశారు. త్వరలో 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయనున్నారని.. ఇదే విషయం స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలే అసెంబ్లీ లాబీల్లో చెప్పుకుంటున్నారని వెల్లడించారు.
వైసీపీ డీల్‌ను టీడీపీకి ఆపాదించే ప్రయత్నం : దొంగలు పడ్డ ఆరు నెలల తర్వాత తీరుగా.. రాపాక వ్యవహారం ఉందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ దుయ్యబట్టారు. తెలుగుదేశం తనను సంప్రదించి ఉంటే.. అప్పుడే నోరెత్తకుండా ఇప్పుడు ఎలా మాట్లాడుతారని నిలదీశారు. రాపాక జనసేన నుంచి వైసీపీకి మారినప్పుడు, జరిగిన డీల్‌ను ఇప్పుడు టీడీపీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు ఎమ్మెల్సీ సీట్లు గెలిచే బలమే ఉంటే.. ఏడు స్థానాలకు ఆశపడింది వైసీపీనే అని ఆరోపించారు. సంఖ్యా బలం లేకున్నా ఏడో స్థానం గెలుస్తామనే ఆలోచన సీఎం జగన్‌కు ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి :