Rains in Andhra Aradesh: వర్షాలకు రాష్ట్రంలోని అనేక వాగులు ఉప్పొంగి ప్రహిస్తున్నాయి. రహదారులపై వరదతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అసలే గోతులు తేలిన రహదారులు.. వర్షాలకు నీటి కుంటల్లా తయారయ్యాయని వాహనదారులు.. గగ్గోలు పెడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లల్లోకి నీరుచేరి అసౌకర్యానికి గురయ్యారు.
స్థానికంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో.. ఎన్టీఆర్ జిల్లాలో వాగులు ఉరకలు వేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వద్ద మున్నేరు.. ఉద్ధృతంగా ప్రవహిస్తోంది తిరుపతమ్మ ఆలయం వద్ద కేశఖండశాల.. దుకాణ సముదాయాల్లోకి వరద నీరు చేరింది. బోస్‌పేటలో 50 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. గుమ్మడిదూరు, అనిగండ్లపాడు వద్ద.. మున్నేరు పంట పొలాల్ని ముంచెత్తింది.
108 డ్రైవర్ సాహసం: వత్సవాయి మండలం లింగాల.. పెనుగంచిప్రోలు వంతెనలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లాకు రాకపోకలు పూర్తిగా నిలిచాయి. వత్సవాయికి చెందిన డయాలసిస్ రోగికి అత్యవసర వైద్యం అందించేందుకు.. ప్రతికూల పరిస్థితుల్లోనూ 108 వాహన డ్రైవర్ వంతెన దాటించాడు. కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, కట్టలేరు, వైరా ఏరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాములూరు వద్ద నందిగామ - వీరులపాడు మండలాలకు రాకపోకలకు నిలిచాయి.
ప్రమాదకరస్థాయిల్లోవాగులు: తిరువూరు నియోజకవర్గంలోనూ.. వాగులు ప్రమాదకరస్థాయిల్లో ప్రవహిస్తున్నాయి. తిరువూరు మండలం చౌటపల్లి ప్రధాన రహదారిపై.. గుంతలు ప్రమాదకరంగా మారాయి. తిరువూరు - గంపలగూడెం రహదారి ఛిద్రమైంది. కనుగుల చెరువు, మల్లమ్మ చెరువుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. కట్టలు తెగే ప్రమాదముందని రైతులు ముందస్తుగా ఇసుక బస్తాలు అడ్డు వేశారు.