Railway progress in state: రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. నడికుడి - శ్రీకాళహస్తి, కోటిపల్లి - నర్సాపురం, కడప - బెంగళూరు, రాయదుర్గం- తుముకూరు వంటి కీలకమైన కొత్త లైన్ల నిర్మాణాలను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడుతున్నారు. టీడీపీ హయాంలో కేంద్రంతో సమానంగా రాష్ట్రమూ నిధులు ఇవ్వడంతో పనులు వేగంగా జరిగాయి. వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్ర వాటా ఇవ్వనందున... నాలుగేళ్లుగా పనులు పడకేశాయి. ఈసారి బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు ఇస్తుందనుకుంటే నిరాశే మిగిలింది. దాదాపు 17 వందల కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 150 కోట్లు మాత్రమే కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధులు ఏ మూలకూ సరిపోవని అధికారులు, పనులు ప్రారంభించే పరిస్థితి లేదని రైల్వే అధికారులు అంటున్నారు. రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రం కేటాయించిన సొమ్ము చేస్తే ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు కొన్ని దశాబ్దాలు పట్టొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నడికుడి - శ్రీకాళహస్తి మధ్య 309 కిలోమీటర్ల కొత్త లైన్‌కు అంచనా వ్యయం 2 వేల700 కోట్లు. ప్రభుత్వం ఉచితంగా భూమి సేకరించి ఇవ్వడంతో పాటు నిర్మాణ వ్యయంలో 50 శాతం మేర.... అంటే 13 వందల 50 కోట్లు ఇవ్వాలి . కానీ రాష్ట్రం డిపాజిట్ చేసింది కేవలం 6 కోట్లు మాత్రమే. కోటిపల్లి నర్సాపురం మధ్య 57.21 కిలోమీటర్ల కొత్త లైన్ కు 2 వేల 125 కోట్లు అంచనా వ్యయం కాగా... 25 శాతం రాష్ట్ర వాటాగా 525 కోట్ల 25 లక్షలు సమకూర్చాల్సి ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రం ఇచ్చింది కేవలం 2.69 కోట్లు మాత్రమే. ప్రస్తుతానికి 367.42 కోట్ల కోసం రైల్వే శాఖ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ సారీ నిధులు కేటాయించలేదు. కడప - బెంగళూరు మధ్య 225 కిలోమీటర్ల కొత్త మార్గంలో మన రాష్ట్ర పరిధిలో 218 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంది. ప్రాజెక్టు వ్యయం 2 వేల 849 కోట్లు కాగా.. 50 శాతం రాష్ట్ర వాటా కింద 14 వందల 25 కోట్లు ఇవ్వాలి. గత ప్రభుత్వాలు 190 కోట్లు డిపాజిట్ చేశాయి. ప్రస్తుతం కడప నుంచి పెండ్లి మర్రి వరకు 21.90 మీటర్ల లైన్ మాత్రమే పూర్తయింది. దీని రూటు మార్చాలంటూ వైసీపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన చేయడంతో ఈ ప్రాజెక్టు పురోగతి లేకుండా పోయింది. అయినప్పటికీ పూర్తి చేసిన పనిలో రాష్ట్ర వాటా కింద ఇంకా 26 కోట్ల వరకు ఇవ్వాలని రైల్వే శాఖ కోరుతున్నా .. అవసరమైన నిధులు ఇవ్వలేదు.