Purandeshwari Fire on Sand Exploitation: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ట్రాక్టర్ లోడ్ ఇసుక రూ.5 వేల నుంచి రూ.6 వేలకు పెరిగిందని, ఇసుక ధర పెరగడం వల్ల సామాన్యులపై భారం పడిందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా నిర్మాణ రంగాన్ని నమ్ముకున్న కార్మికులు.. పనులు లేక రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ధర పెరిగిపోవడంతో నిర్మాణ రంగం కుదేలైందని ఆరోపించారు. సరైన కూలి పని దొరకక, వేరే పని చేయలేక దాదాపు 40 లక్షల మంది కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని పురందేశ్వరి వాపోయారు.
Purandeshwari Comments: రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా నిల్వలు, నాణ్యత లేని మద్యంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురందేశ్వరి విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ''రాష్ట్రంలో నాణ్యత లేని మద్యం ప్రజలకు విక్రయిస్తున్నారు. అక్రమంగా జేబులు నింపుకోవాలని వైసీపీ భావిస్తోంది. నిత్యం అవసరమయ్యే ఇసుకపైనా అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంటుంది. నిర్మాణ రంగాన్ని నమ్ముకున్న వారిపై ఇసుక ప్రభావం పడింది. పనులు లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. గతంలో టన్ను ఇసుక రూ.200 నుంచి రూ.300 మధ్య లభించేది. ఇప్పుడు ట్రాక్టర్ లోడ్ ఇసుక రూ.5 వేల నుంచి రూ.6 వేలకు పెరిగింది. ఇసుక ధర పెరగడం వల్ల సామాన్యులపై పెను భారం పడింది.'' అని పురందేశ్వరి అన్నారు.
40 Lakh Construction Workers in AP: రాష్ట్రంలో నిర్మాణ రంగంపై ఆధారపడి జీవించేవాళ్లు దాదాపు 40 లక్షల మంది ఉన్నారని పురందేశ్వరి పేర్కొన్నారు. ఇసుక ధర పెరిగిపోవడంతో నిర్మాణ రంగం కుదేలైందని వ్యాఖ్యానించారు. సరైన కూలి పని దొరకక.. వేరే పని చేయలేక చాలా నానా ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆగ్రహించారు. రాష్ట్రాభివృద్ధి.. నిర్మాణ రంగంతో ముడిపడి ఉందని పురందేశ్వరి గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీని మార్చారని పురందేశ్వరి ఆరోపించారు.