MRPS Leaders Statewide Protests: ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో మందకృష్ణ మాదిగ నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వర్గీకరణ జరగలేదనే ఉద్దేశంతో శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు చేపట్టిన వేలాది మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టడం సరికాదని మందకృష్ణ మాదిగ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాదిగలను చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో తగిన రీతిలో బుద్ధి చెబుతామన్నారు.
ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ ఆందోళన: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆందోళన చేపట్టింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఎమ్మార్పీఎస్ నాయకులు, అధికారులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
వచ్చే ఎన్నికల నాటికి వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మంద కృష్ణ మాదిగ సంతకం చేసిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందివ్వాలంటూ వారు కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఎమ్మార్పీఎస్ నాయకులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, ఎమ్మార్పీఎస్ నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
కడప జిల్లాలో ఉద్రిక్తత: ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలను మోసం చేశారని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ శివయ్య మాదిగ ఆరోపించారు. వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. డప్పులు వాయిస్తూ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్లోని వెళ్లి అధికారులకు వినతిపత్రం ఇస్తామని అనడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు.