రాజసం.. ఆతిథ్యం.. బొల్లారం నిలయం.. - President Draupadi Murmu
President Draupadi Murmu Telangana Tour : శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఇందుకోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. మరి దీని ప్రత్యేకతలు ఏంటి? ఇది ఎప్పటి నుంచి ఉంది? ఇలా అనేక విషయాలు మీకోసం..
తెలంగాణ రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతి
By
Published : Dec 25, 2022, 2:10 PM IST
President Draupadi Murmu Telangana Tour : దేశంలో అత్యున్నమైనది రాష్ట్రపతి పదవి అయితే అత్యున్నత నివాసం దిల్లీలోని రాష్ట్రపతి భవన్. దీనికి దీటుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఉంటుంది. దేశ పరిపాలనా ఉత్తర భారతానికే పరిమితం కాకూడదన్న ఉద్దేశ్యంతో దక్షిణాన దీన్ని ఏర్పాటు చేశారు. సిమ్లాలోనూ రాష్ట్రపతి భవన్ ఉంది. ఈ నెల 26 నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి ఇక్కడికి రానున్నారు. ఈ నిలయాన్ని ఇంద్రభవనంలా తీర్చిదిద్దుతున్నారు.
*1805లో బ్రిటీష్ అధికారులు బొల్లారం రాష్ట్రపతి నిలయాన్ని నిర్మించారు. అప్పట్లో వైశ్రాయ్ అతిథిగృహంగా పిలిచేవారు. దీనికి సమీపంలోని ఆంధ్రసబ్ ఏరియా కార్యాలయానికి వచ్చే రక్షణ అధికారులు ఇక్కడ విడిది చేసేవారు. స్వాతంత్య్రం అనంతరం 1950లో కేంద్రం తన ఆధీనంలోకి తీసుకొంది. అప్పటినుంచి రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్నారు.
*సిపాయిల తిరుగుబాటు సమయంలో కోఠిలోని బ్రిటీష్ రెసిడెంట్‌పై దాడి జరగడంతో రెసిడెంట్ నివాసాన్ని బొల్లారానికి మార్చారు.
*స్వాతంత్య్రం అనంతరం బ్రిటీష్ రెసిడెంట్ నివాసాన్ని నిజాం స్వాధీనంచేసుకొన్నారు. 160 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ భవనాన్ని కేంద్రం నిజాం నుంచి రూ.60లక్షలకు కొనుగోలు చేసింది. అప్పటినుంచి దక్షిణాది నుంచి రాష్ట్రపతి పరిపాలన అందించాలన్న సంప్రదాయం మొదలైంది.
*1984 వరకు అప్పటి రాష్ట్రపతి జైల్‌సింగ్‌తోపాటు అంతకుముందు ఏడుగురు రాష్ట్రపతులు ఏటా సందర్శించారు.
*నీలం సంజీవరెడ్డి ఆరుసార్లు సందర్శించారు. 1991లో శాంతిభద్రతల సమస్యల వల్ల ఆరేళ్లపాటు రాష్ట్రపతి పర్యటన జరగలేదు.
*శంకర్ దయాల్‌శర్మ భద్రత కారణాల వల్ల మొదట్లో రాలేకపోయిన తర్వాత 1995, 96లో రెండుసార్లు వచ్చి నాలుగు నెలలపాటు విడిది చేశారు. 2000లో కేఆర్ నారాయణన్ విడిది చేశారు. 2006లో అబ్దుల్‌కలాం రెండురోజులతో అతి తక్కువ కాలం విడిది చేశారు.
*2007లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ప్రతిభాపాటిల్ ఏటా శీతాకాల విడిది చేసేవారు. అంతకుముందున్న రాష్ట్రపతులు వర్షాకాలం, శీతాకాలంలో విడిది చేసేవారు. ప్రతిభాపాటిల్ పర్యటన తర్వాత రాష్ట్రపతులందరూ శీతాకాల విడిదిగా దక్షిణాదికి వస్తున్నారు. విడిదిని 15 రోజుల నుంచి వారానికి పరిమితం చేశారు.
*2010లో ప్రతిభాపాటిల్ ఔషధవనాన్ని పెంచి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. వనాన్ని ప్రజలు తిలకించేలా కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించారు. అంతకుముందు నిలయం పరిసరాలకు ఎవరినీ అనుమతించేవారు కాదు. 2011 నుంచి రాష్ట్రపతి పర్యటన తర్వాత నిలయాన్ని ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతున్నారు.
*ఔషధ వనంతోపాటు, నక్షత్ర వనం ప్రత్యేకత కలిగి ఉన్నాయి. నక్షత్ర వనాన్ని ప్రణబ్‌ముఖర్జీ 2013లో అశోక మొక్క నాటి ప్రారంభించారు.
*ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలయానికి రావడం తొలిసారి.
29న ముచ్చింతల్‌కు:రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం శంషాబాద్ విమానాశ్రయంలో రిహార్సల్ నిర్వహించింది. రాష్ట్రపతి 29న మచ్చింతల్‌లోని సమతామూర్తిని దర్శించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముచ్చింతల్, శ్రీరామనగరంలోని చిన జీయర్‌స్వామి ఆశ్రమం వరకు భారీ బందోబస్తు మధ్య పోలీస్, ట్రాఫిక్, రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు సంయుక్తంగా రిహార్సల్ నిర్వహించారు.