Praja Chaitanya Sabha In vijayawada : రాష్ట్రంలో తెలుగులోనే పాలన సాగించాలని గతంలో చేసిన చట్టాన్ని అమలు చేయాలని శాసన సభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ డిమాండ్ చేశారు. అధికార భాషగా తెలుగును అమలు పరచాలని, తెలుగులో పాలన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలను పెద్ద ఎత్తున చైతన్య సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 14న అధికార భాష దినోత్సవం జరపాలని ప్రభుత్వ ఉత్తర్వు ఉందని, తెలుగును అధికార భాషగా అమలు చేయాలని ఓ చట్టం ఉందనే సంగతి నేటి పాలకులకు తెలియక పోవడం దారుణని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగులో జీవోలు తేవడం పెద్ద కష్టమేమీ కాదని, తెలుగుపై ఆసక్తి, తపన లేకపోవడం వల్లే ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన తెలుగులో జరగాలని డిమాండ్‌తో తెలుగు భాషోద్యమ సమాఖ్య విజయవాడ ఎంబీవీకే భవన్లో ప్రజా చైతన్య సభ లో మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు.
తెలుగు భాషను ప్రోత్సహించని ప్రభుత్వాలు :తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షుడు సామల రమేష్ బాబు, అధ్యక్షుడు గారపాటి ఉమా మహేశ్వరరావు, రాజ్యసభ మాజీ సభ్యులు పి. మధు, తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమ నేతలు పాల్గొన్నారు. తెలుగు భాషను పరిపాలన భాషగా అమల్లోకి తెచ్చిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కిందని, ప్రస్తుత ప్రభుత్వాలు తెలుగు భాషను ప్రోత్సహించడం లేదని తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షుడు సామల రమేష్ బాబు అన్నారు. తెలుగు కాపాడుకునేందుకు ప్రజలకు ఏడాదిపాటు ఛైతన్య పరచేందుకు సభలు పెడతామన్నారు.