Tribute To Potti Sreeramulu : పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ కేఎస్.జవహర్ రెడ్డి పాల్గొన్నారు.
తెలుగు ప్రజల ఆత్మ గౌరవం :అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం అనితరసాధ్యమని ఆయన కొనియాడారు. ఆంధ్రులు అభివృద్ధిని సాధించి దేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టినప్పుడే శ్రీరాములు ఆత్మార్పణకు విలువ చేకూరుతుందని చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఉద్యమం :అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో యువగళం పాదయాత్రలో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నారా లోకేశ్ నివాళులర్పించారు. తెలుగుజాతి ఆత్మ గౌరవం కోసం ప్రాణాల్నే పణంగా పెట్టారని, స్వాతంత్య్ర పోరాటం, దళితుల దేవాలయ ప్రవేశం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఉద్యమించిన మహనీయుడి ఆశయ సాధనకి కృషి చేయడమే అమరజీవికి మనమిచ్చే ఘన నివాళి అని ట్విటర్ వేదికగా తెలిపారు.
ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో :అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గాంధి విగ్రహం దగ్గర పొట్టిశ్రీరాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి పూజ నిర్వహించారు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలను ఆర్యవైశ్య సంఘం నేతలు కొనియాడారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జయం విశ్వనాథ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో మీ పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు గిద్దలూరు ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గిద్దలూరు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు కావలసిన పరీక్ష ప్యాడ్స్‌ను అందజేశారు. పొట్టి శ్రీరాములు గురించి వారి చేసిన త్యాగాన్ని విద్యార్థులకు వివరించారు.
ప్రాణ త్యాగం :పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్‌లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆవోపా సంఘ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చేసిన సేవలను వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఇవీ చదవండి