Potholes on Road in NTR District: ఆ రోడ్డు వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఓ వైపు భారీ గుంతలు. మరోవైపు కళ్లల్లో ఎగసిపడే దుమ్మూధూళి. ఎదురుగా వచ్చే వాహనాలు కనపడవు... వాటిని తప్పించేందుకు సడెన్ బ్రేక్ వేస్తే కిందపడాల్సిందే. రోడ్డు వెడల్పు చేస్తామని... సగం సగం తవ్వి వదిలేయడంతో... ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. నరకానికి నకళ్లుగా ఉన్న ఆ దారికి మోక్షం కల్పించట్లేదు పాలకులు.
జి.కొండూరు మండలం కందులపాడు- ఎర్రుపాలెం రహదారి దుస్థితి ప్రజలకు నరకప్రాయంగా మారింది. రోడ్డును ఎక్కడికక్కడ తవ్వేసి వదిలేయడంతో... వాహనదారులకు ప్రయాణం దినదినగండంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kandulapadu-Errupalem Road Situation: ఇదీ ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కందులపాడు- ఎర్రుపాలెం రహదారి దుస్థితి. దారి పొడవునా అడుగడుగునా గుంతలు... ఈ దారిలో వచ్చే ప్రయాణికుల కూసాలు కదులుతాయ్.. నడుములు జారుతాయ్... వాహనాలు తరచూ మరమ్మత్తుకు గురవుతాయ్. పెద్ద పెద్ద లారీలు రయ్యిమని దూసుకొస్తూ... దుమ్ములేపుతున్నాయి. భారీగా ధూళి ఎగసిపడటంతో వాహనదారులు కళ్లు, ముక్కు మూసుకోవాల్సిందే. వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి మరింత దారుణం. గుంతలు కనపడక... ప్రయాణికులు కిందపడిన సందర్భాలు కోకొల్లలు. ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నా ఈ రోడ్డును పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు.