Cm Jagan on BR Ambedkar : భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు ముఖ్యమంత్రి జగన్ నివాళులు అర్పించారు. దేశం గర్వించదగ్గ మేధావుల్లో అంబేడ్కర్ అగ్రగణ్యుడు, మహోన్నతుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి అని సీఎం కొనియాడారు. న్యాయ, సామాజిక , ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాల్లో అపార జ్ఞానశీలి అని.. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత అని ప్రశంసించారు. భేద భావాలు మరిచేలా ..మానవత్వం పరిఢవిల్లేలా అంబేడ్కర్ చేసిన కృషి మరువలేమన్నారు. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశామని ట్వీట్‌లో సీఎం తెలిపారు.
Chandrababu Tributes to Ambedkar : సమాజంలోని అసమానతలను తొలగించడానికి అందరికీ ఆమోద యోగ్యమైన చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచిన మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. అంబేడ్కర్ స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ దళితులకు అన్ని విధాలా ప్రాముఖ్యతను ఇచ్చిందన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా చంద్రబాబు ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పించారు. అంబేడ్కర్ గొప్పదనాన్ని భావితరాలకు తెలియజేయాలనే ఆలోచనతో అమరావతిలోని దళితులు ఎక్కువగా ఉన్న శాఖమూరుని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతూ.. 100 కోట్ల రూపాయలతో 20 ఎకరాల్లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, లైబ్రరీ, పార్కుతో కూడిన స్మృతివనం ఏర్పాటుకు ఆనాడు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. పేద విద్యార్ధులకు విదేశీ విద్య అందించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఏ ఊరిలో అభివృద్ధి పనులు చేపట్టినా వాటిని మొదటగా దళిత వాడ నుంచి మొదలెట్టే సంప్రదాయాన్ని తెచ్చామన్నారు. ఇక ముందూ అంబేడ్కర్ స్ఫూర్తితో దళిత సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.