Political Parties AP : ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. పట్టభద్రులు, ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతకు భయపడి వైఎస్సార్సీపీ భారీగా దొంగ ఓట్లు నమోదు చేయించిందని తెలుగుదేశం ఆరోపించింది. సంక్షేమం చూసి ఓట్లు వేయాలని వైఎస్సార్సీపీ, అభివృద్ధి కావాలంటే బీజేపీకే పట్టం కట్టాలని.. కమలం నేతలు ప్రచారం ముమ్మరం చేశారు.
పట్టభద్రులు, ఉపాధ్యాయ, ఎమ్మెల్సీ ఎన్నికలకు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తానన్న సీఎం జగన్.. తర్వాత మాట తప్పారని ఉత్తరాంధ్ర పట్టుభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్ధి వేపాడ చిరంజీవిరావు మండిపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరంలో టీడీపీ నేతలు అశోక్ గజపతిరాజు, కూన రవికుమార్‌తో కలిసి ప్రచారం పాల్గొన్న ఆయన.. ఎన్నికల్లో గెలిపిస్తే యువత, ఉద్యోగుల తరపున పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
"అందరి నుంచి మంచి స్పందన వస్తోంది. అన్ని వర్గాలవారు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తిని వారు ప్రభుత్వానికి తెలియజేయాలని సంసిద్ధులై ఉన్నారు." -వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్ధి
ఎమ్మెల్సీ ఎన్నికలను సార్వత్రిక పోరుకు సెమీఫైనల్స్‌గా భావించి.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల వైఎస్సార్సీపీ అభ్యర్థిని గెలిపించాలని విశాఖలో ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సంక్షేమంతో పాటు బీసీలకు అండగా నిలుస్తున్న వైఎస్సార్సీపీని గెలిపించాలని రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య కోరారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని 60 శాతం వరకు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర బాగుపడాలంటే బీజేపీ అభ్యర్ధి మాధవ్‌ను గెలిపించాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు.