Brain swelling disease baby: అప్పటి వరకు ఆడుతూ పాడుతూ చలాకిగా గంతులువేసిన ఆ పాప ఒక్కసారిగా ఆనారోగ్యం బారిన పడింది. ఆ పాపే ప్రాణంగా జీవిస్తున్న ఆమె తల్లిదండ్రులకు ఒక్కసారిగా గుండెలు ఆగినంత పనైంది. ఆసుపత్రిలో చికిత్స చేయించగా సుమారు 19లక్షల ఖర్చు అయింది. అంతకు మించి డబ్బులు పెట్టే స్తోమత ఆ తల్లిదండ్రుల వద్ద లేదు. తమ పరిస్థితికి చింతించకుండా తమ పాపను ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నారు. అందుకోసం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ వద్దకు వచ్చి పాప చికిత్స కోసం సహాయం చేయాలని వేడుకోవాలనుకున్నారు. దేవుడు వరమిచ్చే వాడో లేదో తెలియదు కానీ, పూజారిలా పోలీసులు ఆ తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లారు. సీఎం జగన్తో తమ సమస్యలు చెప్పుకోనివ్వకుండా అడ్డుపడ్డారు.
జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల కోసం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం జగన్ నిర్వహించిన సభ వద్ద అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సీఎం జగన్ వస్తున్నారని తెలిసి తమ కూతురు దీనస్థితిని చూపించి వైద్య సాయం అడిగేందుకు వచ్చిన దంపతులపై పోలీసులు కనీసం జాలి చూపకుండా కఠినంగా వ్యవహరించారు. తిరువూరు సమీపంలోని చీమలపాడు గ్రామానికి చెందిన కళ్యాణి దంపతుల కుమార్తె భవ్య. పది నెలలక్రితం భవ్య మెదడు వాపు వ్యాధి బారిన పడింది. పేదకుటుంబానికి చెందిన వారు ఇప్పటి వరకు అప్పులు చేసి 19 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించారు. అయినా భవ్య ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదు.